లాక్‌డౌన్ కారణంగా దాదాపుగా అన్ని రంగాలూ ప్రభావితం అవుతున్నాయి. కరోనా ఉద్ధృతితో యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రస్తుతం మన దేశం అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరోనా ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిందనడంలో అతిశయోక్తి లేదు. కొవిడ్ దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలు అయిన పరిస్థితి. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌తో ప్రధానంగా చిరువ్యాపారులు చితికిపోతున్నారు. ఆదాయ వనరుగా ఎంచుకున్న వృత్తి కొనసాగే పరిస్థితి లేకపోవడంతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే మునుపెన్నడూ చూడనంత నష్టం చిత్రసీమకు వాటిళ్లింది. గతేడాది లాక్‌డౌన్ దెబ్బతో మూతబడ్డ థియేటర్లు అలా తెరుచుకున్నాయో లేదో మళ్లీ కరోనా విరుచుకుపడింది. దీంతో మళ్లీ థియేటర్లు మూయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సినీ కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. సుమ తన చలాకి,పంచ్ డైలాగ్‌తో అందర్నీ ఎంటర్టైన్మెంట్ చేసే యాంకర్ సుమ పరిశ్రమ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ యాంకర్ సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉద్వేగభరితమైన పోస్టు చేశారు.
మేకప్ కిట్లు బూజుపట్టిపోతున్నాయంటూ ఆమె మేకప్ వేసుకుంటూ ఆ వీడియోలో కనిపించింది. ‘వీడియోను సరదాగా చూడండి. నోట్ మాత్రం కాస్త సీరియస్‌గానే చదవండి. వినోద పరిశ్రమలో మేం శారీరకంగా పనిచేయాల్సి ఉంటుంది. అదే మా కడుపు నింపేది. అంటే నటీనటులు, వ్యాఖ్యాతలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, కెమెరామెన్, లైట్ మెన్, ఫైట్ మాస్టర్స్, ఎడిటర్స్, మేకప్, హెయిర్‌స్టైలిస్ట్, ఆర్ట్, ఫుడ్, ప్రొడక్షన్ ఇలా అన్నీ సెట్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారంతా ఇప్పుడు ఖాళీ ఉంటున్నారు. మళ్లీ పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల కుటుంబాలను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనూ మళ్లీ ఇండస్ట్రీ పనులు మొదలవుతాయని భావిస్తున్నా’ అని ఆమె రాసుకొచ్చారు.