బజారుకో, పనిమీదో, ఆఫీస్‌కో ఎక్కడికి వెళ్తున్నా… ఇంట్లో పిల్లలు మేమూ వస్తామంటూ మారం చేస్తారు. ఒక్కోసారి ఒక్కరినే విదిలి వెళ్లలేక తల్లిదండ్రులు కూడా వారిని తీసుకెళ్తుంటారు. మరి, అలా వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉంటామని చెప్పలేం. ఒక్కోసారి పొరపాటుగానో, యథాలాపంగానో మనం చేసే పని చెరుపుకోలేని తప్పుకు కారణం కావచ్చు.
అసలు విషయమేంటంటే పిల్లల్ని బయటకు తీసుకెళ్లినప్పుడు ఇప్పుడే వచ్చేస్తాం కదా కారులోనే ఆడుకో అని వదిలేసి వెళ్తుంటారు. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, లేదా కారులో పిల్లలు ఏదైనా భయానికి లోనవ్వచ్చు. అలానే ఓ తల్లి కూడా తన కూతుర్ని కారులో వదిలి వెళ్లింది. ఆ తర్వాత కారులోని చిన్నారి ఒక్కసారిగా భయానికి లోనైంది. అమ్మా, అమ్మా కేకలు వేసింది. చేతులు ఊపుతూ ఆర్తనాదాలు చేసింది. పని మీద వెళ్లిన అమ్మ ఇంకా రాలేదు. పాపకు భయం ఎక్కువైపోయింది. అలాంటి సందర్భాల్లో గాలి పీల్చుకోకపోవడం, భయంతో ఎక్కువ గాలి పీల్చుకోవడంతో కారులోపల ఉన్న ఆక్సిజన్ అయిపోయో ప్రమాదం ఉంటుంది.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కారులోకి చూశాడు. భయాందోళనతో కేకలు పెడుతున్న చిన్నారిని చూశాడు. ఎలాగైనా ఆ చిన్నారిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. చాలాసేపు, అన్నివిధాలుగా ప్రయత్నించాడు. అతడి ఒక్కడి వల్ల కాలేదు. ఎవరైనా సహాయం చేస్తే బావుండని ఎదురు చూశాడు. అటుగా మరో వ్యక్తి వచ్చాడు. ఇద్దరూ కలిసి కారు డోర్ ఓపెన్ చేశారు. ఆ చిన్నారిని రక్షించారు. తర్వాత వచ్చిన తల్లి, చేసిన తప్పు తెలుసుకుని ఆ ఇద్దరికి ధన్యయవాదాలు తెలుపుతుంది. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను నటి ‘హంసానందిని’ తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. వీడియో చూసిన అందరూ ఆ ఇద్దరు వ్యక్తుల్ని మంచి పని చేశారంటూ మెచ్చుకున్నారు.