ఈరోజుల్లో మీ దగ్గర టాలెంట్ ఉంటే గుర్తింపు రావడానికి పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరమే లేదు. అంతేకాకుండా సెలబ్రిటీ అవ్వడానికి వయసుతో సంబంధం కూడా లేదు. టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే ఎవరైనా జీవితంలో విజయం సాధించవచ్చు. అలాంటి ఒక స్టోరీనీ ప్రముఖ యూట్యూబర్ వెంకటేశ్ ది.
ఏదైనా సాధించాలి అనే కసి ఉంటే అందుకు వయసు అస్సలు అడ్డే కాదు అని చాలా సందర్భాల్లో రుజువైంది. పైగా టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈరోజుల్లో మీ టాలెంట్ ని లోకానికి తెలియజేయడం ఇంకా సింపుల్ పని. సోషల్ మీడియాలో పుణ్యమాని ఎంతో మంది సెలబ్రిటీలు కూడా అయ్యారు. వారికి వచ్చిన పనిని, తమకి తెలిసిన కళని నలుగురికీ తెలియజేస్తూ ముందుకెళ్తున్నారు. అలా ఒక సాధారణ వంట మాస్టర్ నుంచి 60 ఏళ్ల వయసులో వెంకటేశ్ ప్రముఖ యూట్యూబర్ అయ్యారు. ప్రారంభించిన రెండేళ్లలోనే తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ఎంత అంటే అతి కొద్ది సమయంలోనే 7 కోట్లకు పైగా వ్యూస్ సాధించారు.
వెంకటేష్ స్వగ్రామం బాపట్ల జిల్లా కొల్లూరు. ఆయన దాదాపు 40 ఏళ్లపాటు వంట మాస్టర్ గా పనిచేశారు. కుటుంబ పోషణ, జీవనోపాధి ఇలా కారణం ఏదైనా వంటమాస్టర్ గా 4 దశాబ్దాలు సేవలందించారు. ఎన్నో శుభకార్యాల్లో తన వంటలతో అతిథుల మనసు గెలుచుకున్నారు. వెంకటేష్ అంటే చేయి తిరిగిన వంట మాస్టర్ అని పేరు ప్రఖ్యాతలు సాధించారు. అయితే ఇంక రిటైర్ అయిపోవాలని భావించారు కావొచ్చు. రూటు మార్చి యూట్యూబర్ అయిపోయారు. ఫుడ్ ఆన్ ఫామ్ అనే ఛానల్ లో తన రెసిపీస్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్ ని మే 31, 2021న స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి వెంకటేశ్ రెసిపీస్ కి ఎంతో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఆయన వంట చేసే తీరు, ఆ వాతావరణం, మరీ ముఖ్యంగా ఆయన రెసిపీని చివర్లో టేస్ట్ చూసి రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కర్నూలుకు దగ్గర్లో ఉన్న తెలంగాణలోని అలంపూర్ లో వెంకటేశ్ ఫామ్ ఉంది. అక్కడే వీడియోస్ చేస్తుంటారు. గోగూర పచ్చడి చేయాలి అనుకుంటా ఎంచక్కా పొలంలోకి వెళ్లి గోంగూర, పచ్చిమిరపకాయలు కోసుకొస్తారు. అలా ఎంతో న్యాచురల్ గా వీడియోస్ మెప్పిస్తున్నారు. అంతేకాకుండా ఆ వీడియోల్లో వినిపించే శబ్ధాలు మీ మనసుని హత్తుకుంటాయి.
ప్రకృతిలో ఉండే రమణీయత ఆ వీడియోల్లో చూడచ్చు. ఆంధ్రా- తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల వంటలను చేస్తుంటారు. మరీ ముఖ్యంగా సాంప్రదాయ వంటలకు ఎక్కువ ప్రాధన్యత ఇస్తుంటారు. తనకు వచ్చిన పనిలో నైపుణ్యం సాధించడమే కాకుండా.. ఆ పనిని మరో నలుగురికి నేర్పిస్తున్నారు. ప్రతి రెసిపీకి సంబంధించి కొలతలు కూడా చెప్తుంటారు. వంట రాని వాళ్లు కూడా ఆ వీడియో చూసి వంట చేసేయచ్చు. మొత్తానికి వెంకటేష్ వంటమాస్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. యూట్యూబర్ గానూ ఎంతో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా కోట్ల మందికి తన రెసిపీస్ ని పరిచయం చేస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. ఫుడ్ ఆన్ ఫామ్ యూట్యూబ్ వీడియోస్ మీరూ చూశారా? ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.