ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది. ఏ చిన్న వస్తువును కూడా ఆన్‌లైన్‌లో కొనడం స్టేటస్‌గా భావిస్తున్నారు కొందరు. అవసరం ఉన్నా.. లేకపోయినా వస్తువుల్ని కొనిపడేస్తున్నారు. ఇక, ఆన్‌లైన్‌లో వస్తువులు కొని లాభపడ్డవారు.. మోసపోయిన వారు రెండు రకాలు ఉన్నారు. తాజాగా, ఓ యువతి ఆన్‌లైన్‌లో పొరపాటున ఖరీదైన వస్తువు కొంది. దాని ధర అక్షరాలా 80 లక్షల రూపాయల పైమాటే. అయితే, ఆ డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. డబ్బులు ఇవ్వమని జనాలను వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే…
క్వెన్‌లిన్ బ్లాక్‌వెల్ అనే యువతి ఓ కంటెంట్ క్రియేటర్. ఆమె సోషల్ మీడియా ఖతాకు పెద్ద మొత్తంలో ఫాలోవర్స్ ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె ఆన్‌లైన్‌లో సోఫా కొనడానికి వేలంపాటలో పాల్గొంది. ఆ వేలం పాటలో అందరికంటే ఎక్కువ పాడి క్వెన్‌లిన్ విజేతగా నిలిచింది. అయితే, ఇక్కడే అసలు చిక్కువచ్చి పడింది. సాధారణ ధర ఉన్న సోఫా కాస్తా లక్ష డాలర్లకు వెళ్లింది. మన ఇండియన్ కరెన్సీలో అయితే 80 లక్షల రూపాయలకు పైమాటే. ఇప్పుడు అంత పెద్ద మొత్తం చెల్లించడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. దీంతో తన ఫాలోవర్స్‌ను డబ్బులకోసం ప్రాధేయపడుతోంది.
ఈ మేరకు తన కారులో ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. దాన్ని తన టిక్‌టాక్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఆమె.. ‘‘ సరదాగా సోఫా కొందామని వేలం పాటలో పాల్గొన్నాను. నా కార్డు డీటేల్స్ ఇచ్చేశాను. చివరకు పెద్ద మొత్తంలో వేలంపాట పాడాను. సోఫా వచ్చింది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర డబ్బులు ఉంటే నాకు కొంచెం సహాయం చేయండి. దయచేసి నన్ను ఆదుకోండి!’’ అంటూ ఫ్యాన్స్‌ను అడుక్కుంటోంది. ఇక దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సరదా ఎందుకు చేశావంటూ కొందరు మండిపడుతుంటే.. అయ్యో పాపం అని కొందరంటున్నారు.