మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత వుండొచ్చు, కానీ అందరి కన్నా ముందే తెలుసుకోవాలన్న ఉబలాటం కొన్ని సార్లు చిక్కులకు దారితీయోచ్చు. ఏదీ కొత్తగా, వింతగా కనిపిస్తోందో దానితో లేదా వారితో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి సృష్టించిన హైప్ అంతా, ఇంతా కాదు. దీంతో ఈ రైలుతో ఫోటోలు దిగాలని భావించిన ఓ వ్యక్తి.. ఆ రైలు గురించి సరైన సమాచారం తెలియక.. అందులో ఇరుక్కుపోయి వార్తల్లో నిలిచారు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. సికింద్రాబాద్ నుండి విశాఖ పట్నం వరకు ఈ రైలు పరుగులు పెడుతోంది. తక్కువ వ్యవధిలో, అత్యాధునిక సదుపాయాలతో గమ్య స్థానాలకు చేర్చే రైలు కావడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. అందులో ప్రయాణించే వారే కాదూ, అది ఏ ఏ స్టేషన్లలో ఆగితే.. అక్కడకు వచ్చి జనాలు సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. ఇంత వరకు ఒకే కానీ.. ఓ వ్యక్తి ట్రైన్ లోకి ఎక్కి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించి, అందులో ఇరుక్కు పోయాడు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుందని తెలియక సెల్ఫీలు తీసుకుంటూ ఉండిపోయే సరికి.. రైలు ఫ్లాట్ ఫాంను దాటేసింది. ఈ ఘటన రాజమండ్రిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
విశాఖ నుండి బయలు దేరిన ఈ రైలు..రాజమండ్రిలో ఆగింది. దీంతో ఓ వ్యక్తి రైలులో ఎక్కి ఫోటోలు తీసుకున్నాడు. వెంటనే ఆ రైలు తలుపులు మూసుకుపోయాయి. దీంతో కంగారు పడ్డ అతడు.. డోర్ వద్దకు వెళ్లి, బటన్ నొక్కి, రైలును ఆపాలని సిబ్బందిని వేడుకున్నాడు. ఎలా వచ్చావని అడగ్గా, ఫోటోలు తీసుకునేందుకు వచ్చి ఇరుకున్నానని, తలుపులు ఓపెన్ అయ్యేలా చూడాలని కోరాడు. దీంతో కోప్పడ్డ సిబ్బంది.. ఫోటోలు బయట నుండి తీసుకోవాలని, ఇది మధ్యలో ఎక్కడా ఆగదని, డోర్స్ కూడా ఓపెన్ కావని, విజయవాడలోనే ఆగుతుందని సదురు వ్యక్తికి చీవాట్లు పెట్టారు. దీంతో సదరు వ్యక్తి విజయవాడ వరకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ వ్యక్తికి ఫైన్ వేశారా, లేదా తెలియక చేశాడని వదిలేశారా.. సమాచారం తెలియాల్సి ఉంది.
ఫోటో తీసుకుందాం అనిరాజమండ్రి లో వందే భారత్ ట్రైన్ ఎక్కారు..డోర్స్ ఆటోమేటిక్ లాక్ అయిపోయాయి..ఇక చేసింది ఏమి లేదు విజయవాడ లో దిగాల్సిందే.
ఎంత పనైంది pic.twitter.com/E0FIewGyEK
— HEMA NIDADHANA (@Hema_Journo) January 17, 2023