పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి బయటపడేస్తాడు అంటారు. కానీ, ప్రతి తండ్రి మాత్రం తనకి కుమార్తె కావాలనే కోరుకుంటాడు. కూతురులేని తండ్రులు ఎంతో మంది నాకు ఒక్కరైనా అమ్మాయి పుట్టుంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. ప్రతి అమ్మాయికి తన తండ్రే సూపర్ హీరో. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్లు ‘డాడీస్ లిటిల్ ప్రిన్సెస్’ అనమాట.
పెళ్లై పిల్లలు పుట్టినా కూడా తనకి తన తండ్రి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. తండ్రిని విడిచి ఉండాలంటే ఓ కుమార్తెకు అంత తేలికైన విషయం కాదు. తండ్రీ కూతుళ్ల బంధం గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బంధం ఎలాంటిదో.. ఎంత గొప్పదో తెలియజెప్పే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది ముంబయిలోని లోకల్ ట్రైన్ లో జరిగిన ఘటన. రైలు ఫుట్ బోర్డులో తకుమార్తె(ఏడాదిలోపు వయసు ఉండచ్చు)ను పట్టుకుని ఆ తండ్రి అలా కూర్చుని ప్రయాణిస్తున్నాడు. ఆ చిన్నితల్లి చేతిలో ఏవో తినే పదార్థం ఉంది. అందులోంచి ఒక ముక్క తీసి తన తండ్రి నోటికి అందించబోయింది. అతను నాకు ఒద్దు నువ్వే తినూ అంటూ ఆ చిట్టితల్లిని వారించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె నువ్వే తినూ అన్నట్లుగా తండ్రి నోటికి అందించింది.
ఈ వీడియో చూస్తే చాలామందికి అర్థమవ్వచ్చు ఎందుకు కూతురిని రెండో తల్లి అంటారో? తెలిసీ తెలియని వయసులోనే ఆ చిన్నారి తన తండ్రికి అలా తినిపంచడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పున్నామ నరకం నుంచి బయట పడేసే పుత్రుడికన్నా.. బ్రతికినంత కాలం ప్రేమ చూసుకునే ఇలాంటి కుమార్తె పుడితే చాలని కోరుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.