భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవటం అన్నది తరచుగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ముద్దు అనేది కొన్ని సెకన్లు పాటు పెట్టుకోవటం పరిపాటి. కానీ, అదే గనుక ఏకథాటిగా 58 గంటల పాటు పెట్టుకుంటే!.. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట ఈ ఆశ్చర్యానికి తెరతీసింది. అయితే, ఈ పని గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించటం కోసం చేసింది. వివరాల్లోకి వెళితే.. 2013లో ‘‘రిప్లెస్ బిలీవ్ ఇట్ ఆర్‌నాట్’’ షో వాళ్లు థాయ్‌లాండ్‌లోని పటాయాలో రెండు రోజుల సుధీర్ఘమైన ముద్దు పోటీ పెట్టారు. ఈ పోటీల్లో ఎకచాయ్ తిరనరాత్, లక్‌సన తిరనరాత్ అనే భార్యాభర్తల జంటతో పాటు మరికొన్ని జంటలు కూడా పాల్గొన్నాయి.
ఈ జంటల్లో కొంతమంది పెళ్లి కాని వారు కూడా ఉన్నారు. అంతేకాదు! 70 ఏళ్ల వృద్ధ జంట కూడా ఈ పోటీలో పాల్గొంది. ఈ పోటీ రూల్స్ ప్రకారం… పోటీ ముగిసే వరకు ఎవ్వరూ తమ పెదాలను పక్కకు తీయకూడదు. కనీసం తినటానికి, తాగడానికి కూడా పక్కకు తీయకూడదు. ఆఖరికి వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నాకూడా తీయకూడదు. ఇక, పోటీ స్టార్ట్ అయిన తర్వాత అందరూ ద్రవ రూప ఆహారాలను తీసుకున్నారు. వాష్‌రూముకు కూడా కలిసి వెళ్లారు. ఇలా కచాయ్ తిరనరాత్, లక్‌సన తిరనరాత్‌ల జంట ఏకంగా 58 గంటలా.. 35 నిమిషాలా.. 58 సెకన్లు అలా ముద్దు పెట్టుకునే ఉండిపోయింది.
మిగిలిన వాళ్లు మధ్యలోనే ఓపిక లేక కుప్పకూలిపోయారు. గెలిచినందుకు గానూ ఈ ఇద్దరికీ 3వేల డాలర్ల డబ్బులతో పాటు రెండు డైమండ్ రింగ్‌లు ఇచ్చారు. ఈ ఏకథాటి ముద్దు ప్రపంచ రికార్డుల్లోకి సైతం ఎక్కింది. 58 గంటల సుధీర్ఘమైన ముద్దుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నాకు వాళ్ల బాధ ఏంటో ఇక్కడినుంచే అర్థం అవుతోంది’’.. ‘‘ ఈ రికార్డును బ్రేక్ చేయటానికి నాకు లవర్ లేదు.. అంత టైం కూడా లేదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.