Silver Shivling: పురావస్తు శాస్త్రవేత్తలు ఏదైనా ప్రదేశంలో తవ్వకాలు జరిపినపుడు దేవుడి విగ్రహాలు, ఇతర పురాతన వస్తువులు బయటపడ్డం సహజం. కొన్ని కొన్ని సార్లు పొలంలో దున్నుతున్నపుడు, ఇంటికోసం పునాదులు తీస్తున్నపుడు పురాతన వస్తువులు లేదా ఏదైనా నిధి దొరుకుతుంటాయి. కానీ, నీళ్లలో ఇలాంటివి దొరకటం అన్నది చాలా అరుదైన సంఘటన. అలాంటి అరుదైన సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. నదిలో ఏకంగా ఓ భారీ శివలింగం దొరికింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, డోగ్రీఘాట్ పట్టణానికి చెందిన రామ్ మిలాన్ నిషద్ పూజా పాత్రలు కడగటానికి దగ్గరలోని గగ్రా నదికి వెళ్లాడు.
నదిలో స్నానం చేసిన తర్వాత పాత్రలు కడగడానికి నదిలోని మట్టిని బయటకు తీస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో నీటి లోపల అతడి చేతికి ఏదో వస్తువు తగిలింది. దీంతో అతడు పక్కన చేపలు పడుతున్న రామచంద్ర నిషద్ అనే మరో వ్యక్తిని సహాయం కోసం పిలిచాడు. ఇద్దరూ కలిసి తవ్వగా ఓ వెండి శివలింగం బయటపడింది. దాన్ని వాళ్లిద్దరూ ఊర్లోకి చేర్చారు. నదిలో వెండి శివలింగం దొరికిన సంగతి ఊర్లో చాలా వేగంగా వ్యాపించింది. దీంతో జనం దాన్ని చూడ్డానికి ఎగబడ్డారు. ఇక, వెండి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఊరికి వెళ్లారు.
శివలింగాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ దాన్ని తూకం వేయగా 53 కేజీలు తూగింది. ఇక, నదిలో దొరికిన వెండి శివలింగం పోలీస్ స్టేషన్‌లో ఉందని తెలియగానే జనం అక్కడికి కూడా క్యూలు కట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ శివలింగం ఎక్కడిదో తాము దర్యాప్తు చేస్తున్నామని, దాని గురించి ఏ వివరాలూ తెలియకపోతే దర్యాప్తు ఆపేస్తామని ఎస్పీ తెలిపారు. దాన్ని నదిలో కనిపెట్టిన గ్రామస్తులకే విగ్రహాన్ని తిరిగిచ్చేస్తామని తేల్చిచెప్పారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం.. పడగవిప్పి ఆడుతూ..!