ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పాముల్లో కొన్ని జాతులు విష సర్పాలు కాగా.. మరికొన్ని విషం లేనివి. ఇక, విషం లేని పాముల్లో కొండచిలువలు, అనకొండలు ప్రమాదకరమైనవి. ఇవి తమ సైజును బట్టి చిన్న జీవుల దగ్గరినుంచి పెద్ద పెద్ద అడవి దున్నల వరకు దేన్నైనా తినేస్తాయి. అనకొండలు, కొండ చిలువలు మనుషుల్ని తినటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా, ఇండోనేషియాలో ఓ మహిళను కొండ చిలువ మింగేసింది. రబ్బర్ కోసం అడవిలోకి వెళ్లిన ఆమెను పాము మింగేసింది. మహిళ కోసం వెతకటానికి అడవిలోకి వెళ్లిన జనం పాము ఆమెను మింగేసినట్లు గుర్తించారు. దాన్ని చంపి, పొట్టలోంచి శవాన్ని బయటకు తీశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని సుమత్రా, జాంబి ప్రావిన్స్‌కు చెందిన 54 ఏళ్ల జారా అనే మహిళ శుక్రవారం రబ్బర్ తేవటానికి అడవిలోకి వెళ్లింది. అయితే, రాత్రి చీకటిపడ్డా కూడా ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఊరి జనం గుంపులుగా ఆమెను వెతకటానికి అడవిలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వారికి 22 అడుగుల ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. దాని కడుపు ఓ పెద్ద జీవిని తిన్నట్లుగా భారీగా ఉంది. అది గమనించిన జనం కొండ చిలువ జారాను తినేసి ఉంటుందని భావించారు. వెంటనే దాని మీద దాడి చేసి చంపేశారు. అనంతరం పాము కడుపు కోశారు. అందులో జారా మృతదేహం కనిపించింది. వారు పాము కడుపులోంచి జారా మృతదేహాన్ని పక్కకు తీశారు.
జారా మృతితో ఆ ప్రాంతంలో అలజడి మొదలైంది. ఆ అడవిలో అతి పొడవైన పాములు చాలా ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. దాదాపు 27 అడుగుల పొడవున్న పాము కూడా ఉందని, దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. అయితే, ఆ పాము చాలా బలమైనది కావటంతో పట్టుకోవటం కష్టంగా మారిందన్నారు. అడవిలోని పాములు తమ పెంపుడు జంతువుల్ని చంపి తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు పాము కడుపును చీల్చి జారాను బయటకు తీస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.