మహిళలు బలహీనంగా ఉంటారా? అంటే కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా మగాళ్లతో పోలిస్తే మహిళలే బలంగా ఉంటారట. మహిళలే పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారట. యావరేజ్ గా 77 నుంచి 80 ఏళ్ల వరకూ జీవిస్తారట. రోగాలతో పోరాడే శక్తి, ఆరోగ్యకరమైన గుండె కలిగి ఉంటారట. మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మానసికంగా గానీ, శారీరకంగా గానీ ఆడవారు ఉన్నంత దృఢంగా మగాళ్లు కూడా ఉండలేరు. ప్రపంచంలో ఎక్కువ గుండె జబ్బులు వచ్చేది కూడా మగాళ్లకే అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆడవారికి హార్ట్ లేదు కాబట్టి.. హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ లేదని అంటారు గానీ అసలు ఆడవాళ్లు అంత స్ట్రాంగ్ గా ఉండడానికి పలు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఈ శాస్త్రీయ ఆధారంగా మగవాళ్ల కంటే ఆడవాళ్లే బలవంతులు అని చెప్పవచ్చు.
మగాళ్లలో ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. ఆడవాళ్ళ విషయంలో మాత్రం వారికి రెండు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. దీని వల్ల వాళ్ళు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడగలరు. రోగకారకాలతో పోరాడే శక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. మహిళల శరీర నిర్మాణంలో మైక్రో ఆర్ఎన్ఏగా పిలవబడే జన్యువులను నియంత్రించే పదార్థాలు ఎక్స్ క్రోమోజోముల్లో 10 శాతం ఉంటాయి. ఇవే రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, క్యాన్సర్ తో పోరాడడంలోనూ తోడ్పడతాయి. అలాంటిది రెండు క్రోమోజోములు ఉండటం వల్ల మహిళలు.. మగాళ్లతో పోలిస్తే మరింత బలంగా ఉంటారు.
మహిళలు మగాళ్ల కంటే స్ట్రాంగ్ అని చెప్పడానికి మరొక కారణం పీరియడ్స్. పీరియడ్స్ వల్ల మహిళలకు గుండె జబ్బులు తక్కువగా వస్తాయట. మగాళ్లలో పీరియడ్స్ లేవు కాబట్టి గుండె జబ్బులు ఎక్కువ వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆడవాళ్ళలో రుతుస్రావం జరగడం వల్ల వారి రక్తం నుంచి విపరీతంగా ఐరన్ ని కోల్పోతారు. ఐరన్ ఎక్కువ అయితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న మగాళ్లకు గుండె యొక్క పనితీరు, శక్తి 20 నుంచి 25 శాతం పడిపోతుంది. అదే ఆడవాళ్ళ గుండె విషయానికొస్తే వయసుతో పని లేకుండా అలానే శక్తివంతంగా పనిచేస్తుంది. ఆడవారి గుండెలు బలమైన ఫైబర్లతో తయారై ఉంటాయి. అలానే సాగే గుండె కణజాలాలు ఉంటాయి. ఎప్పుడైతే గుణే కణజాలం గట్టిపడుతుందో అప్పుడు ఆడవారి గుండె బలహీనపడుతుంది. బలహీనమైన గుండె కండరాల ఫైబర్లతో మగవారు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది.
మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు బలమైన వాసన పీల్చే స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఉదాహరణకు మాంసం కుళ్లిపోయిన విషయాన్ని మగాళ్ల కంటే ముందే ఆడవాళ్లు కనిపెట్టగలుగుతారు. మాంసం అనే కాదు, ఏ పదార్థాన్ని అయినా చెడిపోయిందో, లేదో అని గుర్తించడంలో ముందుండేది ఆడవాళ్లే అని అధ్యయనాలు చెబుతున్నాయి. మగాళ్లతో పోలిస్తే అసహ్యం, విరక్తి అన్న భావనలు ఆడవాళ్ళలో తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఆడవాళ్లు జలుబు, కడుపు సంబంధిత సమస్యలు, ఇతర అంటువ్యాధులు సోకే అవకాశాలు తక్కువ.
ఆడ శిశువులతో పోలిస్తే.. మగ శిశువులు గర్భం దాల్చిన మొదటి నెలల్లో చాలా సున్నితంగా, బలహీనంగా ఉంటారట. వేసవి కాలం, చలికాలం మధ్య కాలంలో గర్భం దాల్చినప్పుడు ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చుతగ్గులకు తట్టుకోలేరట. వేసవికాలంలో కాకుండా కొంచెం ముందుగా అంటే వేసవి తాపం లేని నెలల్లో పుడితే ప్రమాదం తక్కువ ఉంటుందట. కానీ ఎటువంటి ఉష్ణోగ్రతల్లో అయినా గర్భంలో ఆడ శిశువు బలంగా ఉంటుందని, పుట్టినప్పుడు కూడా దాదాపు బలంగానే ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అదండీ విషయం. ఆడవాళ్ళ ఆయుష్షు మగాళ్లతో పోలిస్తే ఎక్కువే. అనుకున్నది సాధిస్తారు, ప్రవర్తన బాగోపోతే మగాళ్లని కూడా సాధిస్తారట. ఇన్ని రకాలుగా ఆడవాళ్ళు మగాళ్లతో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్లకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ, క్యాన్సర్ తో పోరాడే శక్తి ఎక్కువ, రోగనిరోధక శక్తి ఎక్కువ. ఎదిగిన తర్వాత అంటే అనుకోవచ్చు.. కడుపులో బిడ్డగా ఉన్నప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండడం అంటే మామూలు విషయం కాదు. స్త్రీ అంటే ఆదిశక్తి. స్త్రీ అంటే ప్రకృతి. ఆమె శక్తి ముందు అందరూ బలహీనులే అని గమనించాలి. ఆడవాళ్ళు కూడా తమ శక్తిని గమనించాలి. మరి మగాళ్ల కంటే బలంగా ఉన్న ఆడవాళ్లపై మీ అభిప్రాయం ఏమిటి? ఇన్ని విషయాల్లో బలంగా ఉన్న మహిళలూ.. మీ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.