ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి మ్యాప్ అనేది ఉంటుంది. మ్యాప్ ద్వారా ప్రాంతాలను గుర్తించడానికి వీలుగా ఉంటుంది. అయితే మీరు ఈ విషయాన్ని గమనించారా? భారత్ మ్యాప్ లో సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్ లు సగం మాత్రమే ఉంటాయి. కానీ శ్రీలంక మాత్రం పూర్తిగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో అని మీరెప్పుడైనా ఆలోచించారా? స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇండియా మ్యాప్ తో పాటు కింద శ్రీలంకను కూడా గీయించేవారు. ఇండియా మ్యాప్ అంటే శ్రీలంక ఉండాల్సిందే అని మనకి నేర్పించారు. కానీ అది ఎందుకు ఉంటుందో? అనేది మాత్రం ఎవరూ చెప్పలేదు. మరి ఇండియా మ్యాప్ లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా?
శ్రీలంక మన దేశం కానప్పుడు మనకెందుకు వాళ్ళ గురించి, మ్యాప్ లోంచి తీసేయచ్చు కదా.. అంటే అది నేరం అవుతుంది. భారత దేశ పటం కింద శ్రీలంకను తీసేస్తే చట్టరీత్యా అది నేరం అవుతుంది. ఐక్యరాజ్యసమితిలో ‘లా ఆఫ్ ది సీ’ పేరుతో ఒక అంతర్జాతీయ చట్టం ఉంది. తెలుగులో సముద్ర చట్టం అంటారు. ఈ చట్టం ప్రకారం.. ఒక దేశం యొక్క సరిహద్దుకి ఆనుకుని సముద్రం ఉంటే గనుక.. ఆ సరిహద్దు నుండి ఆ సముద్ర ప్రాంతం దూరం 200 నాటికల్ మైల్స్ అంటే 370 కిలోమీటర్ల మధ్యలో ఉంటే.. దాన్ని మారిటైం జోన్ ఆఫ్ కంట్రీగా పరిగణిస్తారు. అంటే 370 కి.మీ. లోపు ఉంటే దాన్ని సముద్ర ప్రాంతంగా పరిగణిస్తారు.
ఈ చట్టాన్ని యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చింది. సముద్ర చట్టం (యుఎన్‌సిఎల్ఓఎస్-1) మీద 1956లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం తర్వాత యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ 1958లో సముద్ర చట్టాన్ని ప్రకటించింది. సముద్రానికి సంబంధించిన సరిహద్దులు మరియు ఒప్పందాల విషయంపై ఏకాభిప్రాయం ఉండాలనేది ఈ యుఎన్‌సిఎల్ఓఎస్-1 సారాంశం. దీని తర్వాత 1982 వరకూ మూడు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో సముద్రానికి సంబంధించిన చట్టాలను గుర్తించడం జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత.. ఏ దేశానికి చెందిన బేస్ లైన్ అయినా మ్యాప్ లో చూపించడం అనేది తప్పనిసరి అయ్యింది.
ఒక దేశం యొక్క ప్రాంతం 200 నాటికల్ మైల్స్.. వేరే దేశానికి ఆనుకుని ఉంటే గనుక దాన్ని ఆ దేశం యొక్క మ్యాప్ లో చూపించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక దేశం సముద్ర తీరంలో లేదా ఆ దేశం యొక్క సరిహద్దు ప్రాంతం సముద్రంతో సంబంధం కలిగి ఉంటే.. ఆ దేశం యొక్క బోర్డర్ అనేది మరొక దేశం యొక్క మ్యాప్ లో చూపించాలి. ఈ కారణంగానే శ్రీలంక మన దేశ పటంలో కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీలంక 200 నాటికల్ మైల్స్ లోపే ఉంది. అందుకే భారత్ సరిహద్దు నుండి 200 నాటికల్ మైల్స్ దూరంలో ఉండే ప్రదేశాలన్నీ మ్యాప్ లో చూపించబడ్డాయి. పాకిస్తాన్, చైనా పూర్తిగా కనబడకపోవడానికి, శ్రీలంక పూర్తిగా కనబడడానికి కారణం ఇదే.
భారత్ లో ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంకకు మధ్య ఉన్న దూరం 18 నాటికల్ మైల్స్ మాత్రమే. సముద్ర తీరంతో ఏ దేశ సరిహద్దు అయినా సంబంధం కలిగి ఉండి.. వాటి మధ్య దూరం 200 నాటికల్ మైల్స్ దాటితే గనుక ఆ దేశాన్ని మ్యాప్ లో చూపించాల్సిన పని ఉండదు. అదన్నమాట విషయం.. మన పక్క దేశాలైనా పాకిస్తాన్, చైనాలు ఇండియా మ్యాప్ లో పూర్తిగా లేకపోవడానికి.. శ్రీలంక మాత్రం పూర్తిగా ఉండడానికి కారణం యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చిన సముద్ర చట్టం. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.