విమానం రెక్కల మీద ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఎందుకు ఉంటాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రంగులే ఎందుకు ఉంటాయి? ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?
ఆకాశంలో విమానం వెళ్తున్నప్పుడు రెక్కల మీద ఎరుపు, ఆకుపచ్చ రంగు లైట్లు కనబడతాయి. మీరు గమనించారా? ఆ లైట్లు ఎందుకు ఉంటాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? అన్ని విమానాల మీద ఈ లైట్లు ఉండకపోవచ్చు కానీ కమర్షియల్ ఫ్లైట్స్ కి ఈ లైట్లు అనేవి ఉంటాయి. రాత్రి పూట ఈ లైట్లు ఫ్లాష్ అవుతా ఉంటాయి. అయితే ఈ లైట్లను వెలిగించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. విమానం రెక్కల మీద ఉండే ఈ ఎరుపు, ఆకుపచ్చ రంగు లైట్లను నావిగేషన్ లైట్లు అని అంటారు. ఇతర పైలట్లకు దూరంగా వచ్చే విమానం స్పష్టంగా కనిపించడం కోసం ఈ లైట్లను ఏర్పాటు చేస్తారు. అలానే భూమ్మీద ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ లైట్లను అమర్చుతారు.
అయితే ఈ నావిగేషన్ లైట్లు ఎలాంటి సంకేతాలను విడుదల చేయవు. కానీ రాత్రి పూట ఇతర పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సులభంగా చూడగలిగేలా ఈ నావిగేషన్ లైట్లు విమానాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. చాలా వాణిజ్య విమానాలు ఒక రెక్క మీద ఆకుపచ్చ, మరొక రెక్క మీద ఎరుపు రంగు లైట్లు కలిగి ఉంటాయి. ఎడమ రెక్క మీద ఎరుపు, కుడి రెక్క మీద ఆకుపచ్చ రంగు లైటు ఉంటుంది. ఈ రెండు లైట్లు ఫ్లాష్ అవుతూ విమానం యొక్క విజిబిలిటీని పెంచుతాయి. అయితే మీకు ఒక సందేహం వచ్చే ఉంటుంది. నావిగేషన్ కోసమే ఐతే ఒకే రంగు ఉపయోగించవచ్చు కదా, ఆకుపచ్చ, ఎరుపు రెండు రంగులు ఎందుకు అని మీకు అనిపించే ఉంటుంది.
రెండు లైట్లు ఆకుపచ్చ రంగువి అయినా లేదా రెండు లైట్లు ఎరుపు రంగువి అయినా పైలట్లు లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఎదురుగా వచ్చే విమానాన్ని డ్రోన్లు లేదా వాతావరణ బెలూన్స్ అని అనుకునే అవకాశం ఉంది. అందుకే విమానానికి మాత్రమే ఎరుపు, ఆకుపచ్చ కాంబినేషన్ లైట్లు సెట్ చేశారు. కాబట్టి విమానాలు గాలిలో ఎగిరే ఇతర వస్తువుల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ రకంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు లైట్లు వాడడం అనేది పడవలకు కూడా ఉంది. 19వ శతాబ్దంలో మెరైన్లు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా ఉండేందుకు ఎరుపు, ఆకుపచ్చ రంగు ఫ్లాష్ లైట్లను అమర్చారు. దీన్నే విమానాలకు అప్లై చేశారు.
ఈ నావిగేషన్ లైట్లు అనేవి రాత్రి పూట విమానం స్పష్టంగా కనబడేలా చేయడంతో పాటు ఒకదానితో ఒకటి ఢీ కొనడాన్ని తగ్గిస్తుంది. ఈ రంగులే ఎందుకు, వేరే రెండు వేర్వేరు రంగులు వాడచ్చు కదా అంటే.. ఇతర రంగులతో పోలిస్తే ఆకుపచ్చ రంగు అనేది మనిషి కన్నుకు చాలా సున్నితంగా ఉంటుంది. అలానే ఎరుపు రంగు అనేది ఆకాశం, సముద్రం రంగులకు విరుద్ధంగా ఉంటుంది. వేరే రంగులు ఐతే కలిసిపోయే అవకాశం ఉంది. అందుకే ఎరుపు, ఆకుపచ్చ రంగులను మాత్రమే వాడతారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.