సినిమాల్లో హీరో కమెడియన్స్ ని అడ్డం పెట్టుకుని కథ నడుపుతా ఉంటారు. సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా హీరో నన్నే ఎందుకు వాడుకున్నాడు అంటే.. టిష్యూ పేపర్ లా తుడుచుకోవడానికి తప్ప మరెందుకూ పనికి రావు కాబట్టి అని ఒక డవిలాగ్ కొట్టేస్తాడు వేరే కమెడియన్. అలానే ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉండగా ఈ సైంటిస్ట్ లు మా మీదే ఎందుకు బ్రో ప్రయోగాలు చేస్తారు అని ఎలుక అడిగితే దానికి చాలా కారణాలు ఉంటాయి.
ఏ పరిశోధన అయినా సరే శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఎలుకలను మాత్రమే ఎంపిక చేస్తారు. పరిమాణంలో చిన్నవి కాబట్టి ఎలుకలను వాడతారు. ఎలుకల కంటే చిన్నవి చీమలు, దోమలు ఉన్నా ఎలుకలనే వాడడానికి కారణం.. జన్యుపరంగా, జీవ సంబంధం, ప్రవర్తన వంటి విషయాల్లో ఎలుకలు మనుషులతో పోలికలు కలిగి ఉంటాయి. మనుషుల లక్షణాలు చాలా వరకూ ఎలుకల లక్షణాలను పోలి ఉంటాయి. మెడికల్ టెస్టింగుల్లో వాడే ఎక్కువ ఎలుకలు సంతానోత్పత్తి కలిగినవి కాబట్టి దాదాపు జన్యుపరంగా ఒకేలా మెడికల్ ట్రయల్స్ లో ఫలితాలను ఇవ్వడానికి సహాయపడతాయి. అందుకే 95 శాతం ల్యాబుల్లో ఉండేవి ఎలుకలే. పరిశోధనల కోసం, ప్రయోగాల కోసం ప్రత్యేకంగా వీటిని పెంచుతారు. ఇప్పటివరకూ ఎలుకలకు ప్రత్యామ్నాయంగా మరే జీవి లేదని ఎఫ్బీఆర్ వెల్లడించింది.
ఎలుకలు ఎక్కువ సంతానోత్పత్తి రేటు కలిగి ఉంటాయి. ప్రయోగాలు వికటించి తనువు చాలించినా ఎలుకలు దొరుకుతాయి. అదే మిగతా జంతువులను వాడితే సంతానోత్పత్తి రేటు ఎలుకలతో పోలిస్తే తక్కువ. సైజులో పెద్దవి కాబట్టి పెరగడానికి కూడా సమయం పడుతుంది. పరిమాణంలో ఎలుకలు చిన్నవి కాబట్టి త్వరగా ఎదుగుతాయి. వీటి ఉత్పత్తిదారులు కూడా ఎక్కువే ఉంటారు. ఇతర జంతువులను పెంచాలంటే ప్రదేశం ఎక్కువ కావాలి, ఫుడ్ ఎక్కువ కావాలి. అదే ఎలుకలు అయితే ప్రయోగాలకు అనువుగా ఉంటాయి. ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా అవి బతకగలవు. పైగా ఎలుకలు తప్ప మరే జీవులు మనుషులతో పోలికలు కలిగి ఉండవు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఎలుక పిల్లలు ఉత్పత్తి చేయడానికి వాటికి ప్రత్యేకించి మనుషుల సహాయం గానీ ప్రత్యేక పరిస్థితులు గానీ అవసరం లేదు.
ఇక ఎలుకలనే వాడడానికి మరొక కారణం బడ్జెట్. ల్యాబులకు, పరిశోధనలకు, ప్రయోగాలకు కేటాయించే బడ్జెట్ తక్కువ. కేటాయించిన బడ్జెట్ లోనే ప్రయోగం పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఇతర జంతువుల కంటే ఎలుకలను ప్రయోగాలకు ఎంచుకుంటారు. మనుషులలో ఎలా అయితే రోగ నిరోధక స్పందనలు ఉంటాయో.. అలానే ఎలుకల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా ఎలుకలు మనుషులు తినే ఆహారమే తింటాయి. మనుషులకు వచ్చే రోగాలే వాటికీ వస్తాయి. ఒబెసిటీ, డయాబెటిస్, క్యాన్సర్, హృదయ సంబంధిత వ్యాధులు, కొన్ని నరాల సంబంధిత వ్యాధులు వంటివి ఎలుకలకు కూడా వస్తాయి. ఈ కారణంగా ఎలుకలను ప్రయోగాల్లో వాడతారు. మరి ఎలుకలనే ఎందుకు ప్రయోగాల్లో ఎక్కువగా వాడతారో తెలిసింది కదా. ఇవి కాకుండా వేరే కారణాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.