బ్యాంక్ చెక్ రాసే సమయంలో అమౌంట్ ని పదాల్లో రాసిన తర్వాత చివరన ఓన్లీ అని రాస్తాము. అయితే ఇలా రాయడానికి గల కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
డిజిటల్ లావాదేవీలు పెరిగినా కూడా ఇంకా ఇప్పటికీ చెక్ లనేవి వాడుకలో ఉన్నాయి. పెద్ద పెద్ద లావాదేవీలకు చెక్ లనే వినియోగిస్తున్నారు. ఒక వ్యక్తికి చెక్ ఇస్తే.. దాన్ని బ్యాంకుకి తీసుకెళ్తే చెక్ లో ఉన్న అమౌంట్ ని ఇస్తారు. దీని కంటే ముందు చెక్ నింపే ప్రక్రియలో దాని మీద అమౌంట్ రాసిన తర్వాత చివరలో ఓన్లీ అని రాస్తారు. ఉదాహరణకు లక్ష రూపాయలు అని నంబర్లు వేసి.. వన్ లాక్ ఓన్లీ అని రాస్తారు. ఓన్లీ అని ఖచ్చితంగా రాయాలా? రాయకపోతే ఏమవుతుంది? అని ఆలోచించారా? ఓన్లీ అని రాయకపోతే బ్యాంకు వారు అనుమతించరా? అంటే ఇదేమీ ఖచ్చితంగా ఉండాలన్న నియమం లేదు. బ్యాంకు వారు కూడా ఖచ్చితంగా ఓన్లీ అని రాయాలి అని బలవంతం చేయరు. కాకపోతే ఇలా రాయడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది.
కేవలం భద్రత కోసమే ఓన్లీ అని రాస్తుంటారు. ఓన్లీ అని రాయకపోతే ఎవరైనా దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెక్ మీద లక్ష రూపాయలని నంబర్ రూపంలో 1,00,000 అని రాసి.. తర్వాత అక్షరాల రూపంలో వన్ లాక్ అని రాస్తారు. ఇలా రాసి ఎవరికైనా చెక్ ఇస్తే.. ఆ కొబ్బరుండ ముఖమోడు వన్ లాక్ లో ఉన్న సున్నాలను ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా అమౌంట్ చివరన ఇంకో రెండు, మూడు అంకెలు యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఇంగ్లీష్ లో రాసిన వన్ లాక్ తర్వాత 500, 600, 700, 800, 900 ఇలా ఏదో ఒక అంకెని అక్షరాల్లో రాసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చెక్ మీద రూపాయలను రాసి ఓన్లీ రాయకపోతే చివరన పైసలను యాడ్ చేసుకుంటారు.
ఉదాహరణకు 10 వేలు, 10,000 అని రాస్తే 10 వేల 99 పైసలు అని, 10,000.90 పైసలు అని మార్చే అవకాశం ఉంది. దీని వల్ల సాధారణ మనిషికి నష్టం ఉండదు కానీ ఈ తేడా వల్ల కొన్ని కంపెనీలు నష్టపోతాయి. టెండర్లు ఫిల్ చేసినప్పుడు కంపెనీలు ఈ పైసల్లోనే బిడ్డింగ్ లో వేల కోట్ల కాంట్రాక్ట్ ని కోల్పోతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వేరే కంపెనీకి చెందిన పర్సన్ ఈ కంపెనీలో పని చేస్తాడు కాబట్టి. బాస్ ఒక అమౌంట్ రాసి చెక్ ఇచ్చి టెండర్ వేయమన్నప్పుడు వీళ్ళు ఆ చెక్ ని మార్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ లో రాసిన అక్షరాల చివర ఓన్లీ అని పెడతారు. అక్కడ స్పేస్ ఉండదు కాబట్టి క్రియేట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. నంబర్లలో రాస్తే కనుక /- సింబల్స్ ని వాడతారు. దీని వల్ల చెక్ ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. మన డబ్బు సురక్షితంగా ఉండడం కోసమే ఓన్లీ అని రాస్తాము.