పెళ్లి చేసి ఒకటి చేసిన ఈ పెద్ద మనుషులు ఆషాఢ మాసం పేరుతో విడదీసేస్తారు. అరె కొత్తగా పెళ్లయ్యింది. ఇంకా సరిగా ప్రేమించుకోలేదు, ఒకరినొకరు అర్థం చేసుకోలేదు.. అంతలోనే విడదీసేస్తే ఎలా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?
అందంగా పెళ్లి చేసి, కొత్త కాపురం పెట్టించి తీరా ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఆషాఢ మాసం అని చెప్పి దూరం పెట్టేసి కొత్త దంపతులను నిరాశ పరుస్తుంటారు ఈ పెద్దలు. ఇలా ఎందుకు చేస్తారు? వీళ్ళకేమీ పని లేదా? దంపతులను ఇలా విడదీయడం మహా పాపం, నేరం అది, ఇది అంటూ కొత్తగా అబూదయవాదులు పుట్టుకొచ్చి.. మూఢ నమ్మకాలు, వంకాయ అంటూ హడావుడి చేస్తారు. అయితే మూఢనమ్మకాలు, చాదస్తాలు అని కొట్టి పడేసే వారికి వీటి వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, సైన్స్ వంటివి తెలియవు. అసలు ఆషాఢ మాసంలో నూతన దంపతులను ఎందుకు దూరం పెడతారు. అత్తారింట్లో కొత్త కోడలిని ఎందుకు ఉండనివ్వరు. దీని వెనుక ఉన్న కారణం ఏంటి?
ఆషాఢ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపడానికి, కొత్త దంపతులను దూరం చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని సైకాలజీకి సంబంధించినవి అయితే కొన్ని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసినవి. జ్యేష్ఠ మాసంలో ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో తొలకరి మొదలై వర్షాలు కురుస్తాయి. పొలం పనులు జోరందుకునేది ఈ మాసంలోనే. రైతులకు ఇది చాలా ముఖ్యమైన సమయం. అప్పట్లో అందరూ వ్యవసాయం చేసేవారు కాబట్టి.. ఇంట్లో వాళ్ళు పొలం పనులకు వెళ్ళాక ఏకాంతంగా గడిపేందుకు కొత్త దంపతులు ఇష్టపడతారు. ఇలా ఉంటే మగాడు వ్యవసాయాన్ని వదిలేసి భార్య చుట్టూ తిరుగుతాడని చెప్పి భార్యను పుట్టింటికి పంపిస్తారు. అలానే అల్లుడిని కూడా అత్తారింటికి వెళ్లనివ్వరు. అప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా పొలం పనులపై దృష్టి పెడతారు.
ఆషాఢ మాసం తర్వాత వచ్చేది శ్రావణ మాసం. ఈ మాసంలో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఆడవారు ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. మరొక కారణం ఏంటంటే.. ఆషాఢ మాసంలో తొలి గర్భం ఏర్పడితే తొమ్మిది నెలల తర్వాత వైశాఖ, జ్యేష్ఠ మాసాల మధ్య అంటే మార్చి-మే నెల కాలంలో తొలి కాన్పు వస్తుంది. వేసవి కాలం కాబట్టి ఈ సమయంలో వడగాల్పుల వేడి, ఆ తర్వాత వచ్చే వర్షాల వల్ల ఇన్ఫెక్షన్లు తల్లి, బిడ్డలా ఆరోగ్యానికి మంచిది కాదని దూరంగా ఉంచుతారు. పుట్టబోయే శిశువు ఈ వేడిని, ఈ సమయంలో సంక్రమించే వ్యాధులను తట్టుకోలేదు కాబట్టి ఆషాఢ మాసం సమయంలో గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
మరొక కారణం ఏంటంటే.. ఎఫెక్షన్. ఆషాఢ మాసంలో దంపతులను దూరం పెట్టడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత, ఆప్యాయత, అనురాగాలు, ఆకర్షణ, విరహం వంటివి కలుగుతాయి. ఆషాఢ మాసం తర్వాత ఇద్దరూ కలిస్తే వీరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది. అప్పటి వరకూ దూరంగా ఉన్న వీళ్ళు ఒకేసారి కలిసే సరికి మానసికంగా, శారీరకంగా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. అందుకే భారతదేశంలో విడిపోయే వజ్రాల కంటే కలిసుండే దంపతులే ఎక్కువ. ఆషాఢ మాసం అంటే కేవలం శరీరానికి, వ్యామోహానికి, విరహానికి సంబంధించి మాత్రమే కాదు, రెండు మనసులు ఏకమవ్వడానికి కూడా. ఆషాఢ మాసం మొదలైతే ఆకర్షణ, వ్యామోహం, విరహం ఎక్కువవుతాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. అదన్నమాట విషయం. కొత్తగా పెళ్ళైన వారిని ఆషాఢ మాసంలో దూరం పెట్టడం వెనుక ఇంత దూర దృష్టి ఉంది. అది మన పూర్వీకుల గొప్పతనం, మన ఆచారాల గొప్పతనం.