వజ్రం కంటే విలువైనది ఏదీ లేదంటారు. బంగారం కంటే కూడా వజ్రమే ఖరీదైనది. కానీ ఎక్కువ మంది వజ్రం మీద కాకుండా బంగారం మీదనే పెట్టుబడి పెడతారు. అంబాసిడర్, బెంజ్ కార్ల గురించి పోలుస్తూ అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘అక్క అంబాసిడర్.. నేను బెంజ్’ అని త్రిష చెబుతుంది. అప్పుడు మహేష్ బాబు కౌంటర్ గా ‘బెంజ్ అందరూ బాగుందంటారు, కానీ అంబాసిడరే కొంటారు’ అని అంటారు. అలానే వజ్రం కూడా అందరూ బాగుందంటారు, కానీ బంగారమే కొంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? చాలా మంది తమ దగ్గర డబ్బు ఉంటే బంగారం కొనేస్తారు. కొంతమంది ఖాళీ స్థలాలు, పొలాలు వంటి వాటి మీద డబ్బు పెట్టుబడి పెడతారు. ఇంకొంతమంది స్టాక్ మార్కెట్ లో షేర్లలో పెట్టుబడి పెడతారు. కానీ వజ్రం మీద పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు.
అయితే బంగారం మీదనే ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడానికి కారణం.. ఆర్థిక ఒడిదుడుకులు వస్తే టక్కున తాకట్టు పెట్టి నిలబడడానికి. బంగారం కొంటే బ్యాంకుల్లో సులువుగా రుణాలు వస్తాయి. ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే టక్కున బ్యాంకుకు వెళ్లి.. డబ్బు తెచ్చుకోవచ్చు. దీనికి తోడు ఇవాళ ఉన్న బంగారం ధర రేపు పెరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గినా బంగారం ధర పతనం అయితే అవ్వదన్న నమ్మకంతో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. అలానే బంగారం నాశనం చేయలేనిది. బంగారం కరిగించిన మళ్ళీ బంగారమే అవుతుంది. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి సులువుగా రూపాంతరం చెందుతుంది. నెక్లెస్ ని కరిగించి.. వేరే ఆభరణాలుగా మార్చుకోవచ్చు.
బంగారం కొనడం వెనుక సైకలాజికల్ రీజన్ కూడా ఉంది. మానసికంగా బంగారం ఆకర్షణీయంగా ఉంటుంది. బంగారం ధరిస్తే ఒంటికి చాలా మంచిదని కూడా నమ్ముతారు. బంగారం ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తి బంగారానికి ఉంది. నెగిటివ్ ఎనర్జీని బంగారం తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇలా రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకే మహిళలు ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడతారు. మిగతా వస్తువులు ఏవైనా కొంటే పాతబడిపోతాయి. కానీ బంగారం అలా కాదు. పాతబడేకొద్దీ దాని విలువ పెరుగుతూ వస్తుంది. నిజానికి బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా సురక్షితమైన, తెలివైన పని. ఆర్థిక పరిస్థితులు బాగాలేని సమయంలో బంగారమే కాపాడుతుంది. బంగారం సుదీర్ఘకాలం పాటు దాని విలువను అలానే పడిపోకుండా కాపాడుకుంటూ వస్తుంది. అలానే గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ కొనడం కూడా ఉత్తమమే. తర్వాతి తరానికి సులువుగా అందించవచ్చు.
బంగారం లానే వజ్రాలు కూడా అత్యంత ఖరీదైనవి. వీటిని ధరించడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. కానీ వజ్రాలు ఎక్కువ కొనడానికి ఇష్టపడరు. ఎందుకంటే.. ఒకసారి వజ్రం కొంటే దానికి రీసేల్ విలువ ఉండదు. మళ్ళీ అమ్ముదామనుకున్నా ఎంత పెట్టి కొన్నారో ఆ ధర ఉండదు. వజ్రం ధరలో 25 నుంచి 50 శాతం మాత్రమే వస్తుంది. రిస్క్ ఎక్కువ కాబట్టే వజ్రం జోలికి పోరు. పైగా వజ్రం ధర.. దాని బరువు, స్పష్టత, రంగు, కటింగ్ వంటి మీద ఆధారపడి ఉంటుంది. బంగారంతో పోలిస్తే వజ్రాలు త్వరగా పాడైపోతాయి. వజ్రాల మీద ఇన్వెస్ట్ చేయాలంటే నిపుణులు అయి ఉండాలి. అదే బంగారం మీద పెట్టుబడి పెట్టాలంటే పెద్దగా జ్ఞానం అవసరం లేదు. వజ్రం చాలా అరుదుగా దొరుకుతుంది. కాబట్టి వజ్రాల కొరత అనేది ఉంటుంది. అదే బంగారం అయితే కొరత అనేది ఉండదు.
ఇక వజ్రాలు బాగా ఖరీదైనవి కాబట్టి ధనవంతులు కొనగలరు. మధ్యతరగతి, పేద వాళ్ళు కొనలేరు. ఒకవేళ కొంటే అమ్మడానికి డబ్బున్న వాళ్ళ దగ్గరకు పరుగులు పెట్టాలి. వాళ్ళు సెకండ్ హ్యాండ్ అని చెప్పి వద్దంటే.. ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. బ్యాంకులు వజ్రాల మీద లోన్లు ఇవ్వరు. బంగారం కొనేవాళ్ళు, కొనాలనుకునేవాళ్ళు ఎక్కువ కాబట్టి బంగారం ఎప్పుడైనా సులువుగా చేతులు మారుతుంది. కొన్న ధర కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. కానీ వజ్రాలు అలా కాదు. చాలా తక్కువ మంది కొంటారు. డిమాండ్ అనేది మెజారిటీ ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. మెజారిటీ ప్రజలకు ఉన్న స్థాయిని బట్టి ఒక వస్తువు యొక్క డిమాండ్ అనేది ఉంటుంది. డిమాండ్ అంటే వస్తువు ధర కాదు, వస్తువు అమ్ముడుపోయే ధర. బంగారంతో పోలిస్తే వజ్రం ఖరీదైనది కావచ్చు, కానీ ఒక మనిషికి కష్టమొస్తే ఆ మనిషిని ఖాళీ కడుపుతో పడుకోనియ్యదు. అందుకే బంగారం కొనడానికి ఎగబడతారు జనం. మరి వజ్రం మీద కంటే బంగారం మీదనే ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడానికి కారణం ఏమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.