మతిమరుపు చాలా మందిని వేధించే ఒక సమస్య. నిత్యం చాలా మంది ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మతిమరుపు సమస్యను ఎదుర్కుంటారు. ఇంట్లో భార్య భర్తకు ఏదో తీసుకురమ్మని చెప్తే.. మర్చిపోవడమో, ఆఫీస్ లో బాస్ పని చెప్తే మర్చిపోవడమో ఇలా పలు సందర్భాల్లో మతిమరుపుని ఫేస్ చేస్తుంటారు. చిన్న చిన్న వాటిలో ఎక్కువగా మతిమరుపు అనేది ఉంటుంది. ఎవరో ఒకరు గుర్తు చేస్తేనే గానీ గుర్తు రాని పరిస్థితి. ఈ మతిమరుపు ప్రేమలో కూడా తన పైత్యాన్ని ప్రదర్శించింది. అబ్బాయిలు ప్రేమించడానికి తక్కువ టైం పట్టచ్చు, కానీ మర్చిపోవడానికి ఒక జీవితం పడుతుంది అని మన్మధుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.
మన్మధుడు అంటే మగాడి పేరు కాబట్టి.. మాకు ప్రతికూలంగా రాసారని ఆడవాళ్ల అభిప్రాయం ఆఫ్ ఇండియా. ‘ఆడవాళ్లు అంత తేలిగ్గా ఎవరికీ మనసివ్వరు, ఇస్తే అంత తేలిగ్గా మర్చిపోలేరు’ అని ఇంకొన్ని సినిమాల్లో రాస్తారు. ఏ వీళ్లంతా ఆడవాళ్ళ దగ్గర సింపతీ కోసం రాసిన డైలాగ్స్ అని మగజాతి ఆణిముత్యాల అభిప్రాయం. అసలు ఆడవారు, మగవారు.. ఈ ఇద్దరిలో మతిమరుపు ఎవరికి ఎక్కువ? స్టడీస్ ఏం చెబుతున్నాయి? అంటే ఆడవాళ్లు సంతోషించే మాటే చెబుతున్నాయి పరిశోధనలు. ఆడవాళ్ళ కంటే పురుషులు ఎక్కువగా మతిమరుపుని ఫేస్ చేస్తున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మతిమరుపు వచ్చే ప్రమాదం మహిళల కంటే మగాళ్లకే అధికంగా ఉందని స్టడీస్ చెబుతున్నాయి.
మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్ గా పిలవబడే మెమరీ డిస్ ఫంక్షన్ అనేది సాధారణ మెదడు వృద్ధాప్యానికి, డిమెన్షియాకి మధ్య వచ్చేది. మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్ అనేది డిమెన్షియాకి దారి తీస్తుంది. అయితే మగాళ్లు 30 ఏళ్ల నుంచి లేదా 60 ఏళ్ల నుంచి మతిమరుపుతో ఉంటారని అధ్యయనాల్లో తేలింది. నార్వేలో చేసిన హంట్ 3 అనే స్టడీస్ లో.. స్త్రీలను, మహిళలను కలిపి మొత్తం 37,405 మంది జ్ఞాపకశక్తిని పరిశీలించగా.. మగవారి కంటే ఆడవారికే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉందని తేలింది. ఈ పరీక్షలో మగవారికి, ఆడవారికి జ్ఞాపకశక్తికి సంబంధించి 9 ప్రశ్నలు అడిగారు. వారు యుక్త వయసులో ఉన్నప్పుడే మతిమరుపు ప్రారంభమైందా? తేదీలను గుర్తుపెట్టుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? లేదా కొన్ని రోజుల క్రితమో, కొన్ని ఏళ్ల క్రితమో జరిగిన సంఘటనలను గుర్తుందా? లేదా? అనే విషయాలపై కొన్ని టెస్టులు నిర్వహించారు.
అయితే ఈ టెస్టుల్లో అబ్బాయిలు ఆల్మోస్ట్ ఫెయిలయ్యారు. ఈ స్టడీస్ లో సగం మందికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉందని తేలింది. 1.2 శాతం మంది ఆడవాళ్లకు మతిమరుపు ఉంటే.. 1.6 శాతం మంది మగాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు తేలింది. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు అనేది పెరుగుతుందని.. అయితే ఈ సమస్య మగవారికే అధికంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. అయితే దీనికి గల కారణాలు ఏంటో అనేవి ఖచ్చితంగా చెప్పలేమని చేతులెత్తేశారు పరిశోధకులు. అదొక చేధించలేని మిస్టరీ అని చెబుతున్నారు. అయితే గుండె సంబంధిత వ్యాధి అంటే అధిక రక్తపోటు లేదా హై బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) వంటి రిస్క్ ఫ్యాక్టర్స్.. మెదడుకు సంబంధించిన న్యూరో డిజెనరేషన్ మీద ప్రభావం చూపుతాయని.. అందుకే మతిమరుపు వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ దీనికి సరైన ఆధారాలను అయితే వెల్లడించలేకపోయారు.
ఒక సంఘటనను గానీ ఒక తేదీని గానీ గుర్తుంచుకునే విషయంలో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు వెనకబడి ఉండడానికి కారణం ఏంటో అనేది మిస్టరీగానే ఉందని నార్వే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ టీమ్ ప్రొఫెసర్ జోస్టన్ హోల్మెన్ వెల్లడించారు. అయితే ఈ మతిమరుపు ముదిరితే డిమెన్షియాకి దారి తీస్తుందని, అది ఇంకా ప్రమాదకరమని అంటున్నారు. కొన్ని పరిశోధనలు మాత్రం.. మానసిక, శారీరక ఒత్తుడుల కారణంగా మతిమరుపు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఆఫీస్ పని, ఇంటి బాధ్యతలు, కెరీర్ గోల్స్ ఇలా రకరకాల కారణాల వల్ల మతిమరుపు వస్తుందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఏది ఏమైనా వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగాళ్లకి మతిమరుపు అనేది ఎక్కువగా వస్తుందని పరిశోధనల్లో తేలింది.
అధిక రక్తపోటు, బీఎంఐ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మెదడుపై ప్రభావం చూపుతుందని స్టడీస్ చెబుతున్నాయి. మగాళ్లు పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వంటివి మర్చిపోవడానికి కారణం పైన చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్. పైకి కనబడకపోయినా అవి జ్ఞాపకశక్తిని డామినేట్ చేస్తున్నాయి. అందుకే మతిమరుపు హైలైట్ అవుతుంది. కానీ ఆడవాళ్లలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ. అందుకే వారికి జ్ఞాపకశక్తి ఎక్కువ. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన రోజులను అస్సలు మర్చిపోలేరు. అది భర్త పుట్టినరోజు అయినా, భర్తకు సంబంధించిన అకేషన్ అయినా సరే గుర్తుపెట్టుకుని మరీ సెలబ్రేట్ చేస్తారు. మరి మగాళ్లలో ఎక్కువ మతిమరుపు రావడానికి వేరే ఏమైనా కారణాలు మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి.