రైల్వే స్టేషన్ కి, రహదారికి సంబంధం లేదు. అయినా గానీ కొన్ని రైల్వే స్టేషన్ల పేరు చివర రోడ్ అని ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?
కొన్ని రైల్వే స్టేషన్ల పేర్లు చివర రోడ్ అనే పదం ఉంటుంది. మామూలుగా రోడ్డు మీద ఉండే ఊరి నేమ్ బోర్డుల మీద పేరు చివర రోడ్డు అని వస్తుంది. సర్దార్ పటేల్ రోడ్ అని, షాహిద్ భగత్ సింగ్ రోడ్ అని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ అని ఇలా రోడ్ల పేర్లు ఉంటాయి. రహదారి మార్గం కాబట్టి పేరు చివర రోడ్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. కానీ రోడ్డు మార్గంతో సంబంధం లేని రైల్వే స్టేషన్ల పేర్లు చివర రోడ్ అని ఎందుకు రాసి ఉంటుంది. కొడైకెనాల్ రోడ్, ఖుద్ర రోడ్, నాసిక్ రోడ్, శ్రీకాకుళం రోడ్, భద్రాచలం రోడ్, మార్కాపురం రోడ్ ఇలా కొన్ని రైల్వే స్టేషన్ల పేర్లు చివర రోడ్ అని ఉంటుంది. అయితే ఇలా రాసి ఉండడానికి గల కారణం ఏంటని ఆలోచించారా?
రైల్వే స్టేషన్ పేరు చివర రోడ్ అని రాయడానికి కారణం.. పలానా ఊరికి రైల్వే స్టేషన్ లేకపోవడం గానీ దూరంగా ఉండడం గానీ ఉంటుంది. ఉదాహరణకు కొడైకెనాల్ ని తీసుకుంటే.. ఈ ఊరికి రైల్వే స్టేషన్ కొంచెం దూరంగా ఉంటుంది. అందుకని స్టేషన్ పేరు కొడైకెనాల్ రోడ్ అని పెడతారు. అంటే ఈ స్టేషన్ లో దిగిన ప్రయాణికులు ఆ ఊర్లోకి వెళ్లాలంటే స్టేషన్ బయట రోడ్ మార్గం ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది. అందుకు గుర్తుగా రైల్వే స్టేషన్ పేరు చివర రోడ్ అని రాస్తారు. రైల్వే స్టేషన్ నుంచి నగరానికి లేదా పట్టణానికి రోడ్డు మార్గంలో వెళ్ళడానికి సంకేతంగా రైల్వే స్టేషన్ పేరు చివర రోడ్ అని తగిలించారు. రైల్వే స్టేషన్ చివర రోడ్డు అనే పదం ఉన్న ప్రాంతం.. ప్రధాన నగరం నుంచి 3 కి.మీ. నుంచి 100 కి.మీ. దూరంలో ఉంటుంది. కొడైకెనాల్ ప్రధాన నగరం నుంచి కొడైకెనాల్ రైల్వే స్టేషన్ దాదాపు 80 కి.మీ దూరంలో ఉంటుంది.
మహారాష్ట్రలో ఉన్న వసాయి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి వసాయి పట్టణం 3 కి.మీ. దూరంలో ఉంటుంది. రాంచీ నుంచి రాంచీ రోడ్ రైల్వే స్టేషన్ 49 కి.మీ. దూరంలో ఉంటుంది. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళం 17 కి.మీ. దూరంలో ఉంటుంది. భద్రాచలం రైల్వే స్టేషన్ నుంచి భద్రాచలం పట్టణం 40 కి.మీ. దూరంలో ఉంటుంది. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరు చివర గనుక రోడ్ అని రాయకపోతే.. ఇదే భద్రాచలం ఊరు అని చెప్పి ప్రయాణికులు దిగిన తర్వాత.. ఊరు కనబడదేంట్రా అని రైల్వే వాళ్ళను తిట్టకుండా ఉంటారా? అందుకే తిట్టకుండా ఉండడం కోసమే.. ‘బాబూ ఇది భద్రాచలం రోడ్డు’ అని రైల్వే స్టేషన్ ఊరి బోర్డు మీద రాస్తారు. అదన్నమాట విషయం.. ఊరికి, రైల్వే స్టేషన్ కి దూరం ఉంటే ఇలా రైల్వే స్టేషన్ పేరు చివర ఊరి పేరుతో పాటు రోడ్ అని వస్తుంది.