ఈ దేశంలో జీవించాలంటే ప్రతీ దానికి పన్ను కట్టాలి. సర్వీస్ ట్యాక్స్ అని, వేల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, సెంట్రల్, స్టేట్ జీఎస్టీలు, వినోదపు పన్ను అని, ఆదాయపన్ను అని, కుళాయి పన్ను, ఇంటి పన్ను ఇలా రకరకాల పన్నులు కట్టించుకుంటారు. కుళాయి నీరు ఇంట్లోకి నేరుగా వస్తుంది కాబట్టి కుళాయి పన్ను చెల్లించడంలో అర్ధం ఉంది. మరి ఇంటి పన్ను కట్టడంలో అర్థం ఏముంది? పైసా పైసా కూడబెట్టుకుని.. తిండి తిప్పలు మానేసి నిర్మించుకున్న కలల ఇంటికి పన్ను ఎందుకు కట్టాలి? అని అనిపించిందా? కుళాయి నీరు ప్రభుత్వం మనకి ఇస్తుంది కాబట్టి కడతాం. ఇంటి కోసం ప్రభుత్వం ఏం చేస్తుందని ఏడాదికోసారి ఇంటి పన్ను కట్టాలి? ఎందుకు కట్టాలి రా శిస్తు.. సిమెంట్ కొన్నావా? ఇసుక మోసావా? ఇటుక పేర్చావా? పస్తులున్నావా? అప్పు తీర్చావా? మీకెందుకు కట్టాలి శిస్తు అని అనిపించిందా? పైగా లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. ఇంకా ఈ ఇంటి పన్ను దేనికి? అని మీకెప్పుడైనా అనిపించిందా?
ఇంటి పన్నే కాదు.. ఆదాయపన్ను విషయంలో కూడా ఇలానే అనిపిస్తుంది కదూ. అప్పుల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం పట్టించుకోదు కానీ ఒకసారి సంపాదించడం మొదలుపెట్టాక దా, తియ్, కట్టు అని వెంటపడతారు. అఫ్ కోర్స్ పన్ను కట్టడం మన బాధ్యత కాబట్టి కట్టాల్సిందే. దేశ భద్రత కోసం, ఉద్యోగుల భద్రత కోసం అటు వ్యాపారవేత్తలు, ఇటు ఉద్యోగులు అందరూ ఆదాయం లోంచి కొంత పన్ను కడతారు. ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు ఇలా ప్రజల కోసం పని చేసే వారికి జీతాలు చెల్లించాలి కాబట్టి పన్నులు కట్టించుకుంటారు. ఉద్యోగులతో పాటు పలు సంక్షేమ పథకాల కోసం, విద్య కోసం, వైద్యం కోసం మనం కట్టిన పన్నులను ఖర్చుపెడతారు.
అయితే ఎక్కడ బాధ ఉంటుందంటే.. ఆ పన్నులు దుర్వినియోగం అయినప్పుడు. ఎన్నేళ్లు పన్నులు కట్టినా దేశం, దేశంలో కొన్ని రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాల్లో ఉన్న అనేక ప్రాంతాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోతున్నాయి. బాగా డబ్బున్న వ్యక్తి, కొంచెం సంపాదన ఉన్న వ్యక్తి వారి ఆదాయం నుంచి స్తోమతకు తగ్గట్టు పన్ను కడితే. ఈ పనులన్నీ కలిపి మొత్తం జనాభా కోసం వినియోగిస్తారు. ఉదాహరణకు ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే.. వాళ్ళందరూ ఆహారం కోసం బయటకు వెళ్తే.. ఒకరికి మాత్రమే ఆహారం దొరికితే ఆ ఆహారాన్ని ఇంటి పెద్ద అందరికీ పంచుతాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ ఆకలితో చావకూడదని. ఇలానే దేశంలో కూడా కనీస సదుపాయాలు లేకుండా ఉండకూడదని అందరి జేబుల్లోంచి డబ్బుని పన్ను రూపంలో తీసుకుంటుంది ప్రభుత్వం. అదేంటి ఒకడి కష్టాన్ని ఇలా అందరికీ పంచడం ఏంటి అని అనిపించవచ్చు. ఒకడే అందరి కష్టాన్ని మింగేసే కంటే ఒకడి కష్టాన్ని నలుగురు తినడం మంచిదే కదా అని అంటారు.
డబ్బు మొత్తం కేవలం ఒకడి దగ్గరే పోగులు పడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా పన్నులు కట్టించుకోవాల్సిందే. పడిపోయినప్పుడు పట్టించుకోరు, కానీ లేచి నిలబడినప్పుడే పట్టించుకుంటారు. అదే సమాజం. అయితే ఆ పడిపోయి లేచిన మనిషిలా ఇంకెవరూ పడిపోకూడదనుకుంటే బాధ్యతగా పన్నులు కట్టాలి. ఈ పాడు సమాజం కోసం కాదు, అక్కడ దేశ సరిహద్దుల్లో.. ‘నా ప్రాణం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన సైనికుడికి గౌరవంగా ఇస్తున్న డబ్బు’ అని పన్ను కడితే.. ఆ పన్నుకి ఒక అర్థం ఉంటుంది. నిజమే మన ప్రాణాలకు ముప్పు రాకుండా అనుక్షణం కాపాడుతున్నారు కాబట్టి మనం పన్నులు కట్టాలి. ఆ పన్నులే సైనికుల అవసరాలకు, ఆయుధాలకు, సాంకేతికంగా భారత్ అన్ని రకాలుగా ముందు ఉండడం కోసం రకరకాల పనులకు ఉపయోగపడతాయి. కాబట్టి పన్నులు కట్టడం మంచిదే.
అది సరే ఇంటి పన్ను దేనికి? ఇంటి పన్ను కడితే ఇంటికి ఒరిగేదేమిటి? అని అనుకుంటున్నారా? ఈ ఇంటి పన్ను డబ్బు పంచాయితీ నిధులకు లేదా మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్తుంది. ఆ నిధులతో గ్రామం, పట్టణం, నగర మెయింటెనెన్స్ పనుల కోసం ఉపయోగిస్తారు. రోడ్లు ఊడ్చడం, మురుగునీటి కాలువలను మెయింటెయిన్ చేయడం, చెత్తను తరలించడం, ఫుట్ పాత్, సిమెంట్ రోడ్లు, పార్కులు, వీధి దీపాలు ఇలా ఊరికి సంబంధిన పనుల కోసం ఖర్చు పెడతారు. రోడ్లు ఊడ్చి రోడ్డుని శుభ్రంగా ఉంచే సిబ్బందికి, చెత్తను తరలించి మీ ఇంటిని, వీధిని శుభ్రంగా ఉంచే సిబ్బందికి, మురుగు నీటిని శుభ్రం చేసే సిబ్బందికి ఇలా ఊరి కోసం పని చేసే వారికి, అధికారులకు జీతాలు ఇవ్వడానికి ఇంటి పన్ను ఉపయోగపడుతుంది.
అదన్నమాట విషయం. ఇంటి పన్ను కడితే ఇంటికి ఒరిగేదేమీ లేదు గానీ ఊరికి మాత్రం ఒరిగి తీరుతుంది. ఒకవేళ ఊరికి ఏమీ చేయడం లేదంటే మీ ఇంటి పన్ను పుచ్చిపోయినట్టన్నమాట. అంటే ఇంటి పన్ను ఊరికి పిప్పి పన్నులా తయారవుతుంది. కాబట్టి ఊరికి చేయాల్సిన పనులు చేయకపోతే నిలదీయవచ్చు. ఆ హక్కు మీకు ఉంది. ఇంటి పన్ను కట్టే బాధ్యత ఉన్న ప్రతీ ఒక్కరికీ.. ఊరి బాగు కోరుకునే హక్కు ఉంటుంది. ఊరికి ఏమీ చేయని అధికారులను నిలదీసే హక్కు ఉంటుంది. అలానే దేశం కోసం ఏదో ఒక రూపంలో.. డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా రకరకాల పన్నులు కట్టే ప్రతీ బాధ్యతీయుడికి.. అభివృద్ధికి నోచుకోకపోతే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటే అధికారులను, రాజకీయ నాయకులను నిలదీసే హక్కు ఉంటుంది. మనం కట్టే ఏ పన్ను అయినా ఈ దేశమనే మన ఇంటి కుటుంబ సభ్యుల కోసమే అని గుర్తుంచుకుంటే చాలు. మరి మీరు పన్ను కట్టడాన్ని బాధ్యతగా, గొప్ప పనిగా, గర్వించే విషయంగా భావిస్తున్నారా? పన్నులపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.