గుడి నుంచి ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కోకూడదు అని పెద్దలు చెబుతారు. ఇలా ఎందుకు చెబుతారో అని ఎప్పుడైనా ఆలోచించారా?
ఆలయాలు ఎంత శుభ్రంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గుడి లోపలకు వెళ్లే ముందు బయట కాళ్ళు కడుక్కోవడానికి కుళాయిలు పెడతారు. భక్తులు కాళ్ళు కడుక్కుని ఆలయంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆలయం లోపల దుమ్ము, ధూళి ఉండే పరిస్థితి ఉండదు. కాళ్ళు కూడా మురికి అయ్యే పరిస్థితి ఉండదు. అయితే కొంచెం జిడ్డుగా, నల్లగా తయారవుతాయి. అయినా కూడా ఇంటికి వెళ్ళాక కాళ్ళు కడుక్కోని వారు ఉంటారు. గుడి నుంచి ఇంటికి వెళ్ళాక కాళ్ళు కడుక్కోకూడదు అని అంటారు. శాస్త్రాలు, పురాణాలు, మత విశ్వాసాల ప్రకారం గుడికి వెళ్లి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కోకూడదని చెబుతారు. కొంతమంది స్నానం కూడా చేయకూడదు అని చెబుతారు.
అయితే దీనికి ఆధ్యాత్మిక కారణం అలానే శాస్త్రీయ కారణం కూడా ఉంది. గుడి ఒక్కటే కాదు, చర్చి, గురుద్వార్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు, చేతులు కడుక్కోకూడదు, వెంటనే స్నానం చేయకూడదు అని చెబుతారు. అయితే ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే.. గుడికి వెళ్ళేది భగవంతుడి ఆశీస్సుల కోసం. పాపాలను క్షమించమని భగవంతుడ్ని కోరుకుని.. ఆయన ఆశీర్వాదాలు పొందుతాము. ఆ ఆశీర్వాదాలే మనతో పాటు మన ఇంటికి తెచ్చుకుంటాము. వేదాల ప్రకారం.. గుడి లేదా పవిత్ర ప్రదేశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కోవడం, ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం వంటివి అదృష్టాన్ని, ఆశీర్వాదాలను కడిగేసుకోవడంతో సమానం. అందుకే గుడి నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకూడదని విశ్వసిస్తారు. గుడి నుంచి తెచ్చుకున్న భగవంతుని ఆశీర్వాదాలు ఇంట్లోనే ఉండాలన్న ఉద్దేశంతో పెద్దలు అలా చెబుతారు. కాళ్ళు కడుక్కోవాలి అనుకుంటే ఒక నిమిషం పాటు బాసిమటం వేసుకుని కూర్చుని ధ్యానం చేసిన అనంతరం కడుక్కోవచ్చు. దేవుడ్ని ప్రార్ధించకపోయినా పర్లేదని చెబుతారు.
అయితే కాళ్ళు మురికిగా ఉంటే గనుక కాళ్ళు కడుక్కోవచ్చు. కానీ గుడికి వెళ్లొచ్చిన తర్వాత స్నానం చేయకూడదు. అయితే మరొక కారణం కూడా ఉంది. చావుల నుంచి గానీ అశుభకర కార్యాలు చేసే స్థలాల నుంచి గానీ వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటారు. అంటే నెగిటివ్ ఎనర్జీ, చెడు ప్రభావం ఉండకూడదని కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయడం వంటివి చేస్తారు. అలానే గుడికి వెళ్ళినప్పుడు చైతన్యపరిచే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ తిరిగి వచ్చినప్పుడు మనతో పాటు వస్తాయి. ఇంటికి వెళ్ళాక ఆ వైబ్స్ అలానే ఉండాలంటే కాళ్ళు కడుక్కోకూడదు అని అంటారు. అయితే శనిదేవుడు ఆలయం నుంచి వచ్చినప్పుడు మాత్రం కాళ్ళు, చేతులు కడుక్కోవాలని చెబుతారు. కడుక్కోవడం ద్వారా శని తొలగిపోతుందని అంటారు. మరి మీరు గుడి నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటారా? లేదా? కామెంట్ చేయండి.