మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి. ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. పెంపుడు కుక్కలైనా, ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండడం అనేది వాటి పుట్టుకతో వచ్చిన సద్గుణం. అయితే ఈ కుక్కల్లో ఉన్న దుర్గుణం ఏంటంటే.. అవి కాలు ఎత్తి మరీ వాహనాల టైర్ల మీద, కరెంట్ స్తంభాల మీద సుస్సు పోయడం. ఇదొక్క విషయంలోనే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు.. ఇంటి బయట ఏ మోటార్ సైకిలో, కారో పార్క్ చేస్తే.. ఈ కుక్కలు నేరుగా వచ్చి టైర్ల మీద మూత్రం పోస్తాయి. లక్షలు పెట్టి కొన్న కారు, శుభ్రంగా కడుక్కుని అందంగా చూసుకుంటున్న వాహనాల్ని ఇవి మూత్రంతో కంపు చేస్తుంటే చిరాకు వస్తుంది. ఈ వాహనాలు తమ కోసమే కట్టించిన సులభ్ కాంప్లెక్సులన్నట్టు ప్రవర్తిస్తాయి. అయితే అవి అలా మూత్రం పోయడానికి కారణం ఉంది.
సరిగ్గా గమనిస్తే కుక్కలు కరెంట్ స్తంభాల మీద, బండి చక్రాల మీద, పాతిన కర్రల మీద, రాళ్ళ మీద అవి కొంచెం మూత్రమే పోస్తాయి. ఇంకొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఇలానే ఏదైనా స్థంభం గానీ, బండి చక్రాల మీద గానీ మూత్రం పోస్తాయి. ఒకే దాని మీద ఇవి మూత్రం పోయవు. ఇలా చేయడానికి మూడు కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆహార అన్వేషణలో భాగంగా కుక్కలు గుంపులుగా వెళ్తుంటాయి. అలా వెళ్ళినప్పుడు ఆహారం దొరికితే శుభ్రంగా తినేస్తాయి. తినేసి తర్వాత కొన్ని కుక్కలు ‘ఒరేయ్ నాకు పనుంది, నేను వెళ్తున్నాను’ అని చెప్పి ముందు వచ్చేస్తాయి. కొన్ని కుక్కలు.. ‘మేము కాసేపు ఒక కునుకు వేసి వస్తాము, మీరు వెళ్ళండి’ అని చెప్పి అక్కడే ఉంటాయి. ముందు వెళ్లిన కుక్కలు ఎక్కడికో వెళ్తాయి. వెనకాల వచ్చిన కుక్కలకి ఎక్కడ ఉన్నాయో తెలియాలిగా.
మనుషులకి ఫోన్లు ఉన్నట్టు.. వీటికి ఫోన్లు ఉండవుగా. కాబట్టి ఈ మూత్రం కాన్సెప్ట్ నే అవి ఫోన్లుగా ఉపయోగించుకుంటాయి. అంటే అవి మూత్రం వాసనను పసిగట్టి మిగతా కుక్కలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్తాయి. ఈ సమాజంలో మనోళ్లకి మనమే దారి చూపించాలి బావ.. అని ఈ కుక్కలు కరెంట్ స్థంభం మీద కొంచెం, కొంత దూరం పోయి ఏదైనా పార్క్ చేసిన బండి టైర్ మీద కొంత, ఇంకొంత దూరం పోయి ఒక రాయి మీద, ఇంకొంత దూరం పోయాక ఏ తుప్పల మీదనో ఇలా వెనకాల వచ్చే కుక్కలకి గుర్తులు పెడుతూ ముందుకు వెళ్తాయి. ఇక వెనకాల ఉన్న కుక్కలు, ఈ మనుషులు మనకి దారి చూపించరు, మన వాళ్ళని మనమే వెతుక్కోవాలి బావ.. అని ఆ మూత్రం వాసన పసిగట్టి ముందుకెళ్తాయి.
‘అదిగోరా మావ మనోడు అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు’ అని గుర్తుపడతాయి. ఒకవేళ ఆ మూత్రం వాసన తమ రిలేటివ్ ది కాదని తెలిస్తే.. ‘షిట్ ఇది మనోడిది కాదని’ వెనక్కి వెళ్లి వేరే చోట వెతుకుతాయి. ఇదొక కారణం అని పరిశోధకులు వెల్లడించారు. ఇక రెండవ కారణం.. అవి ఎక్కువగా నిలువుగా ఉన్న వాటి మీద మూత్రం పోయడానికే ఆసక్తి కనబరుస్తాయి. సమాంతరంగా ఉండే ప్రదేశాల్లో కంటే కూడా నిలువుగా ఉన్న స్తంభాల మీద, వాహనాల టైర్ల మీదనే మూత్రం పోస్తాయి. టైర్ లేదా కరెంట్ స్థంభం దిగువ భాగంలో మాత్రమే అవి మూత్ర విసర్జన చేస్తాయి. వాటి ముక్కుతో వాసన చూసేలా దిగువ భాగాన మూత్రం పోస్తాయి.
నేల మీద మూత్రం పోస్తే ఏమైనా ప్రాబ్లమా? అంటే నేల మీద మూత్రం పోస్తే వెంటనే ఆరిపోతుంది. అదే రబ్బర్ టైర్ మీద పోస్తే అది తడి పీల్చుకోదు కాబట్టి కొంత సమయం వరకూ నిలిచి ఉంటుంది. అందుకే అవి ఎక్కువగా టైర్ల మీద మూత్రం పోస్తాయి. మరో కారణం ఏంటంటే.. అవి రబ్బర్ వాసనను బాగా ఇష్టపడతాయట. రబ్బర్ యొక్క వాసనకి అవి బాగా ఆకర్షించబడతాయట. అందుకే అవి టైర్ మీద ముక్కు పెట్టి వాసన చూసి.. ఆ తర్వాత మూత్రం పోస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కుక్కలు కాలు ఎత్తి కరెంట్ స్థంభం మీద లేదా వాహనాల టైర్ల మీద మూత్రం పోయడానికి ఇవే కారణాలు అయి ఉండవచ్చునని పరిశోధకులు కొన్ని స్టడీస్ ద్వారా చెప్పుకొచ్చారు. మరి కుక్కలు కాలు ఎత్తి బండి టైర్ల మీద, కరెంట్ స్తంభాల మీద, గోడల మీద మూత్రం పోయడానికి మీకేమైనా కారణాలు తెలిస్తే కామెంట్ చేయండి.