ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో కొంతమంది మద్యం బాబులు చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటివి చేసి వార్తల్లో నిలిచారు. ఇన్ని అనర్థాలకు కారణమైనప్పుడు మద్యాన్ని ఎందుకు నిషేధించడం లేదూ అని మీకు అనిపించిందా? మద్యం వల్ల విమాన ప్రయాణాల్లో ఇన్ని గొడవలు అవుతున్నా కూడా అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
అంతర్జాతీయ విమానాల్లో ఆహారంతో పాటు మద్యం సరఫరా చేస్తారు. మద్యమే ప్రత్యేకంగా ఎందుకు సరఫరా చేస్తారనే దానికి విమానయాన సంస్థలు ఖచ్చితమైన సమాధానం చెప్పడం లేదు కానీ మద్యం ఇవ్వడానికి పలు కారణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు.. పిల్లల ఏడుపులు, తక్కువ గాలి ఒత్తిడి, దూరపు ప్రయాణాలు, ఫ్లైట్ ఆలస్యం అయితే వచ్చే చిరాకు, ప్రయాణం అంటేనే సహజంగా వచ్చే చిరాకు, భయం.. ఇవన్నీ ప్రయాణికులకు ఒత్తిడి కలిగిస్తాయట. మామూలుగా బస్సుల్లో ప్రయాణం చేసినప్పుడే చిరాకు వస్తుంది. అలాంటిది ఒక దేశం నుంచి మరొక దేశానికి అన్ని గంటలు ప్రయాణం అంటే చిరాకు వస్తుంది. అందుకే చిరాకుతో వచ్చే ఫ్రస్ట్రేషన్ ని, బూతులను, తిట్లను నియంత్రించడానికి తాగి చావండని మద్యం పోస్తారట.
మరొక కారణం ఏంటంటే. లాంగ్ జర్నీలో బోర్ కొట్టకుండా ఉండడం కోసమే ప్రయాణికులకు ఆహారం, మద్యం వంటివి సరఫరా చేస్తారట. మరో కారణం.. మద్యం ద్వారా కూడా ఆదాయం పొందాలన్న ఉద్దేశంతో సరఫరా చేస్తాయట. అయితే ఈ మద్యం ఖర్చుని విమాన టికెట్ తో పాటే వసూలు చేస్తారు. మరొక కారణం ఏంటంటే.. ప్రయాణికులు సైలెంట్ గా ఉండేందుకు మద్యం పోస్తారట. మద్యం తాగితే నిద్రలోకి జారుకుంటారు. దీంతో సిబ్బంది ప్రయాణికుడికి అందించే సేవలు తగ్గుతాయి. ఫుడ్ కావచ్చు, ఇతర సేవలు కావచ్చు. మద్యంతో కొడితే కదలకుండా పడుంటారని అలా చేస్తారట. అలానే మత్తులో ఉండడం వల్ల ప్రయాణికులు అస్తమానూ టైం చూసుకోవడం తగ్గుతుంది.
టైం చూస్తున్న ప్రతిసారీ ప్రయాణికుడికి విసుగు వచ్చి.. సిబ్బందిపై అరిచే అవకాశం ఉంటుంది. అందుకే గమ్మునుండవాయ్ అని చెప్పి మద్యం ఇస్తారట. మరో కారణం ఏంటంటే.. ప్రయాణంలో గానీ, సిబ్బంది సేవల్లో గానీ లోపాలు ఉంటే ప్రశ్నించకుండా ఉంటారని తాగు మచ్చా అని తాగిపిస్తారట. ఇదేమీ ఉచితం కాదు. విమాన టికెట్ మీద వసూలు చేసేదే. ఎటు చూసినా ప్రయాణికుడికే నష్టం. విమానయాన సంస్థలు వాళ్ళకి ఒక్క రూపాయి నష్టం ఉండదు. మితంగా తాగితే ఏం పర్లేదు. అతిగా తాగితేనే లేనిపోని కేసుల్లో ఇరుక్కుంటారు. విమాన ప్రయాణికుల్లో మూడు కేటగిరీ ప్రయాణికులు ఉంటారు. గ్రీన్, ఎల్లో, రెడ్ పేర్లతో 3 కేటగిరీలు ఉంటాయి. గ్రీన్ కేటగిరీ ప్రయాణికులు ఎంత తాగాలో అంతే తాగుతారు. అంతకు మించి తాగితే ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తారేమో అని భయంతో ఆగిపోతారు.
ఇక ఎల్లో కేటగిరీ వాళ్ళు.. తాగుతారు కానీ పరిస్థితులు అదుపు తప్పినప్పుడు మాత్రమే తమలో ఉన్న అపరిచితుడ్ని బయటపెడతారు. ఇక మూడో కేటగిరీ రెడ్ కేటగిరీ. కరువు బ్యాచ్ గాళ్ళని రెడ్ కేటగిరీ కింద జమ చేస్తారు. మళ్ళీ దొరుకుద్ధో లేదో అని కరువొచ్చినట్టు తాగి.. సిబ్బంది మీద, తోటి ప్రయాణికుల మీద ఎగురుతుంటారు. వీళ్ళని రెడ్ జోన్ లో పడేస్తారు. ఇంత రిస్క్ ఉన్నప్పుడు మద్యం సరఫరా చేయడం ఎందుకు అంటే ఇది యాపారం అని అంటారు. తాగి గొడవ చేస్తే.. ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అందుకే ఎలాంటి రిస్క్ ఉండదని విమానయాన సంస్థలు భావిస్తాయట. ఈ విషయాలను పలు సర్వేల ద్వారా వెల్లడించారు. అదన్నమాట విషయం.. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులకు మద్యం ఇవ్వడానికి కారణాలు ఇవే. అయితే దేశీయ విమానాల్లో మద్యం అనుమతిస్తే గొడవలు అవుతున్నాయని నిషేధించారు. భారత్ లో దేశీయ విమానాల్లో మాత్రం మద్యం సరఫరా చేయరు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.