హలో అనేది ఇప్పుడు చాలా కామన్ పదం అయిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేసినా, మనం అవతలి వ్యక్తులకు కాల్ చేసినా మొదటగా అనే మాట హలో. అసలు ఈ హలో అన్న పదం ఎలా వచ్చిందంటారు? ఇంకెవరు ఫోన్ కనిపెట్టింది గ్రహంబెల్ కాబట్టి.. అతని వల్లే వచ్చింది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గ్రహంబెల్ ప్రేయసి పేరు మార్గరెట్ హలో నుంచి వచ్చిందని, ఆమె జ్ఞాపకార్థముగా హలో అని పెట్టాడని అంటారు. ఇది కూడా నిజం కాదు. ఇవి రెండూ రూమర్లే. మరి హలో అన్న పదం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది?
ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత హలో, ఎవరినైనా పరిచయం చేసుకునే ముందు హలో, పరిచయం లేని వ్యక్తిని హలో మిస్టర్ అంటూ పిలవడం ఇలా హలో అనేది జీవితంలో భాగమైపోయింది. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం.. ఈ హలో అనే పదాన్ని చరిత్రలో మొదటిసారిగా 1827లో వాడారు. అయితే స్నేహపూర్వక పలకరింపు కోసం ఈ పదాన్ని వాడలేదు. రెండు రకాలుగా ఈ పదాన్ని ఉపయోగించారు. ‘హలో ఇక్కడ మనకి ఏం పని?’, ‘హలో నువ్వు ఏం చేస్తున్నావనుకుంటున్నావ్?’ అని అనడానికి హలో అనే పదాన్ని ఉపయోగించేవారు. హలో అనేది టెలిఫోన్ లో పలకరింపు కోసం వాడినట్లైతే.. టెలిఫోన్ రాకముందు హలో బదులు ఏ పదం ఉపయోగించేవారు?
ఇప్పుడంటే మనుషులను పలకరించడానికి హాయ్, హౌ ఆర్ యు అంటున్నారు. కానీ 17వ శతాబ్దంలో అమెరికాలో యాత్రికులు పలకరింపు కోసం గుడ్ మారో అని, హౌ నౌ అని, హౌ డు యు ఫేర్ అని, లేదా వాట్ చీర్ అని అనేవారు. కాలక్రమేణా ఈ పదాలు కొట్టుకుపోయి ‘హాయ్ హౌ ఆర్ యు’ అనేది పాపులర్ అయ్యింది. మధ్యయుగంలో హలోకి దగ్గరగా ఉన్న పదం హెయిల్. మధ్యయుగం నుంచి షేక్స్పియర్ కాలం మధ్యలో ప్రజలు హెయిల్ అనే పదాన్ని బాగా వాడేవారు. ఈ హెయిల్ అనే పదం నార్వే దేశపు ఓల్డ్ నోర్స్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం ఆరోగ్యం అని. ఇదే హెయిల్ ని లాటిన్ లో బి వెల్ అని అంటారు. అంటే తెలుగులో బాగా ఉండండి అని అర్థం. ఆరోగ్యంగా ఉండండి, బాగా ఉండండి అని చెప్పడం కోసం హెయిల్ అనేవారు.
ఇదంతా సరే ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు హలో అనడం దేనికి? అంటే దానికో కథ ఉంది. టెలిఫోన్ కనిపెట్టిన గ్రహంబెల్ కూడా మొదటిసారిగా ఫోన్ లో మాట్లాడినప్పుడు హలో అని మాట్లాడలేదు. ‘మిస్టర్ వాట్సన్ కమ్ హియర్ – ఐ వాంట్ యు’ అని మాట్లాడారు. హలో అనే పదం ప్రాచుర్యం పొందడానికి కారణం థామస్ ఆల్వా ఎడిసన్. గ్రహంబెల్ ప్రత్యర్థి అయిన థామస్ ఎడిసన్.. వీళ్లిద్దరికీ పడేది కాదులెండి అప్పట్లో. పోటీ ఎక్కువ. హలో వాడండి అని ఎడిసను, ‘ఆడు చెప్పేదేంటి నేను చెప్తున్నా.. అహొయ్ వాడండి’ అని గ్రహంబెల్లు.. ఇద్దరూ పోటీపడి మరీ వాదమాడుకున్నారు. చివరికి ఎడిసనే గెలిచాడు.
ఎడిసన్.. హలో అనే పదం ఐతే బాగుంటుందని సూచించాడు. ప్రజలను కూడా ఫోన్ లో హలో అనే మాట్లాడమని వాదించాడు. కానీ గ్రహంబెల్ మాత్రం తన జీవితం మొత్తం మీద అహొయ్ అనే మాట్లాడేవాడు. అప్పట్లో దూరంగా ఉన్న వ్యక్తిని పిలవడానికి అహొయ్ అని పిలిచేవారు. అహోయ్ అన్న పదమైతే కరెక్ట్ గా ఉంటుందని గ్రహంబెల్ భావించాడు. 1878లో అమెరికాలో మొదటి టెలిఫోన్ బుక్ ప్రింట్ చేసినప్పుడు.. ఫోన్ మోగినప్పుడు లిఫ్ట్ చేసి ఎలా మాట్లాడాలి అనే దానికి వివరణ ఇస్తూ.. ‘హలో’ అని మొదలుపెట్టాలి అని ప్రచురించారు. దీంతో థామస్ అల్వా ఎడిసన్ ప్రపోజ్ చేసిన హలో పదం ప్రాచుర్యం పొందింది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.