డబ్బు లేకపోతే ఈరోజుల్లో ఏ పనీ జరగదు. ప్రేమ పుట్టాలన్నా, బంధాలు నిలబడాలన్నా అన్నిటికీ మూలం డబ్బు. మరి ఈ డబ్బుని ఎవడు కనిపెట్టాడురా బాబు అని ఎప్పుడైనా ఆలోచించారా?
కరెన్సీ లేక ముందు వస్తువులను, సేవలను ఒకరినొకరు మార్పిడి చేసుకునేవారు. రైతు ధాన్యం ఇస్తే.. కుమ్మరి కుండ ఇచ్చేవాడు. చేనేత కార్మికుడు వస్త్రం ఇస్తే.. వడ్రంగి తలుపులు చేసేవాడు. ఇలా తమకు కావాల్సింది తీసుకుని తమ దగ్గరున్న వాటిని ఇచ్చేవారు. కానీ ఇది ఆ తర్వాత వర్కవుట్ కాలేదు. ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉన్న ధరలను ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారు అనే విషయంలో గొడవలు తలెత్తాయి. ఆ తర్వాత కమోడిటీ డబ్బు వచ్చింది. వస్తువులను మార్పిడి చేసుకోవడానికి సాల్ట్, కాఫీ, టీ, పొగాకు, పశువులను యూనివర్సల్ కరెన్సీగా ఉపయోగించేవారు. ఇది కూడా ఎక్కువ కాలం నడవలేకపోయింది. అయితే 600 సామాన్య శకం పూర్వం ఇప్పుడు వెస్టర్న్ టర్కీగా పిలవబడుతున్న లిడియాలో మొట్టమొదటిసారిగా అధికారికంగా కరెన్సీ అనేది బయటకు వచ్చింది.
లిడియన్స్ ప్రజలు మొదటిసారిగా మెటల్, బంగారం, వెండితో చేసిన నాణాలను ఉపయోగించారని చరిత్రకారులు చెప్పారు. ఇవి వివిధ చిహ్నాలు, సంకేతాలతో ముద్రించబడి వాటి విలువను చూపించేవి. అయితే 640 సామాన్య శకం పూర్వంలో చైనాలో పాత నాణాలను వినియోగించినట్లు చరిత్రకారులు చెబుతారు. లిడియా, చైనా ఏకకాలంలో లోహపు డబ్బును వినియోగించారు. సుమారు 7వ శతాబ్దంలో చైనాలోని టాంగ్ రాజవంశ కాలంలో కరెన్సీగా కాగితపు నోట్లను కనుగొన్నారు. ఇవి 11వ శతాబ్దంలో సాంగ్ రాజవంశీయులు కాలంలో అభివృద్ధి చెందాయి. అయితే దీని కంటే ముందు ప్రామిసరీ నోట్ల రూపంలో కాగితపు నోట్లను సంపన్నులైన వ్యాపారులు పరిచయం చేశారు.
ఎక్కువ మొత్తంలో ఉండే నాణాలను తరలించడం కష్టం కనుక ఆ నాణాలను నమ్మకస్తుడైన వ్యక్తి దగ్గర ఉంచి.. ఒక ప్రామిసరీ నోటు తీసుకెళ్లేవారు. ఆ ప్రామిసరీ నోటు మీద ఎన్ని నాణాలు వదిలిపెట్టి వెళ్లారో అనేది రాసేవారు. వర్తకంలో ఈ ప్రామిసరీ నోట్లనే వాడేవారు. ఈ నోట్లను క్యాష్ రూపంలో మార్చుకునేవారు. ఇదే పద్ధతి ఇప్పుడు కూడా డబ్బు, చెక్స్ రూపంలో కొనసాగుతోంది. 11వ శతాబ్దంలో యూరప్, చైనా దేశాల మధ్య వర్తకం నాణాల రూపంలో జరిగేది. అయితే రాగి ఉత్పత్తి తగ్గిపోవడంతో చైనీయులు పేపర్ ని కరెన్సీగా వాడడం ప్రారంభించారు. తాత్కాలికంగా వినియోగిస్తున్న పేపర్ కరెన్సీని పూర్తి స్థాయిలో అప్పటి రాజవంశీయులు అమలులోకి తీసుకురవాలని అనుకున్నారు. అలా 12వ శతాబ్దంలో కాగితపు నోట్లను ముద్రించారు.
ఈ కాగితాల మీద గుర్తులను, అక్షరాలను ముద్రించడానికి చెక్క బ్లాకులను వినియోగించేవారు. అయితే పేపర్ కరెన్సీ ముద్రణకు ముందు లెదర్ ని కూడా కరెన్సీగా వినియోగించారని చరిత్ర రికార్డులు చెబుతున్నాయి. అప్పటి ప్రముఖ ఇటాలియన్ వ్యాపారి మార్కో పోలో వంటి వర్తకుల ద్వారా పాశ్చాత్య దేశాలకు చైనీయులు వాడిన పేపర్ మరియు లోహపు కరెన్సీ అనేది వ్యాప్తి చెందింది. ఈ మార్కో పోలో చైనా దగ్గర అప్పట్లో పట్టుని కొనుక్కుని వెళ్ళేవాడు. అయితే 17వ శతాబ్దం వరకూ కాగితపు డబ్బు అనేది పాపులర్ అవ్వలేదు. ఎప్పుడైతే లోహం బాగా ప్రియం అయ్యిందో అప్పుడు కాగితపు కరెన్సీకి బాగా ఆదరణ లభించింది. అయితే చాలా కాలం పాటు బ్యాంకులు, కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ కరెన్సీని జారీ చేసేవి. ప్రభుత్వం కాదు.
ఎప్పుడైతే యూరప్ రాజవంశీయులు భారతదేశంతో సహా ప్రపంచ దేశాల్లో కొన్ని ప్రాంతాలకు వలసలు వెళ్లారో అప్పటి నుంచి వారి ప్రభుత్వం కరెన్సీని జారీ చేసే బాధ్యతను తీసుకుంది. అవే బ్యాంకు నోట్లు అయ్యాయి. వీటినే యుద్ధ సమయంలో సరుకులను కొనేందుకు ఉపయోగించేవారు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వాడిన పేపర్ కరెన్సీగా కెనడాలోని కెనడాలోని ఫ్రెంచ్ వలసదారుల కాలంలో రికార్డు అయ్యింది. సైనికులు పేకలను తీసుకెళ్తే.. వాటి మీద ఫ్రెంచ్ గవర్నర్ నంబర్లను మార్క్ చేసి సంతకం పెట్టేవాడు. అలా ఫ్రాన్స్ లో వాటిని క్యాష్ గా ఉపయోగించేవారు. ఆ తర్వాత అందరికీ తెలిసిందే. దేశాలు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ సరిహద్దులు పెరిగాయి. మనీ కాన్సెప్ట్ అనేది బాగా వృద్ధి చెందింది. దేశాలు కరెన్సీలను తీసుకోవడం, ఇతర కరెన్సీలతో విలువ కట్టుకోవడం ప్రారంభించాయి. అలా డబ్బు అనేది వచ్చింది. భౌతికంగా ఉన్న డబ్బు ఇప్పుడు డిజిటల్ గా రూపాంతరం చెందింది. క్రిప్టో కరెన్సీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రూపంలో మారిపోయింది. మరి భవిష్యత్తులో డబ్బు ఎలా రూపాంతరం చెందుతుందో ఊహించండి.