రైలు ప్రమాదాలు జరగకుండా నివారించే వ్యవస్థ ఒకటుందని మీకు తెలుసా? దాన్ని కవచ్ వ్యవస్థ అని అంటారు. దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రైలు మార్గంలో కవచ్ వ్యవస్థ ఉండి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవచ్ వ్యవస్థ అంటే రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవచం. ఒకే పట్టాల మీద వస్తున్న రెండు రైళ్లను ఒకదానితో ఒకటి ఢీకొనకుండా కవచ్ వ్యవస్థ ఆపుతుంది. దీన్ని ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని కూడా అంటారు. లోకోపైలట్ రెడ్ సిగ్నల్ ని పట్టించుకోకుండా రైలును ముందుకు పోనిచ్చినా ముందు ఉన్న రైలును ఢీకొట్టకుండా ఆటోమేటిక్ గా బ్రేకులు అనేవి అప్లై అవుతాయి. ఈ కారణంగా ప్రమాదాలు అనేవి జరగవు. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడ్ సిస్టం (టీసీఏఎస్) పేరుతో దీన్ని ప్రారంభించారు.
2022 మార్చి 23న రైల్వే మంత్రిత్వ శాఖ కవచ్ పేరుతో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థను పరిచయం చేసింది. ముగ్గురు విక్రేతలతో కలిసి రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) డెవలప్ చేసిన కవచ్ అనేది నేషనల్ ఏటీపీ సిస్టమ్స్ ఫర్ ఇండియన్ రైల్వేస్ గా అడాప్ట్ చేసుకుంది. దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైలు ఆపరేషన్స్ కి సపోర్ట్ చేస్తూనే.. ప్రమాద సమయంలో సిగ్నల్ పాసవ్వకుండా,అలానే ఓవర్ స్పీడ్ అవ్వకుండా లోకోపైలట్ కి సహాయం చేస్తుంది. అవసరమైతే ఆటోమేటిక్ గా బ్రేకులు అప్లై చేస్తుంది. ట్రైన్ స్పీడ్ ని నియంత్రిస్తూనే ప్రమాదాలను నివారిస్తుంది.
ప్రమాదాన్ని గుర్తించి లోకోపైలట్ స్పందించడంలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్ అప్లికేషన్ ఉంటుంది. పొగమంచు కండిషన్స్ లో అతివేగంతో వెళ్తున్న సమయంలో క్లియర్ గా కనిపించడం కోసం లైన్ సైడ్ సిగ్నల్ ని క్యాబిన్ లో డిస్ప్లే చేసే ఫీచర్ ఉంది. లోకోపైలట్ నుంచి లోకోపైలట్ కి కమ్యూనికేషన్ ద్వారా మూవ్మెంట్ అథారిటీని కంటిన్యూగా అప్డేట్ చేయడం, లెవల్ క్రాసింగ్స్ వద్ద ఆటోమేటిక్ విజిల్ వేయడం, ఢీకొనడాన్ని నివారించడం ఈ కవచ్ వ్యవస్థలో ఉన్న ఫీచర్స్. అత్యవసర సందర్భాల్లో రైళ్లను నియంత్రించడానికి ఎస్ఓఎస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. దక్షిణ మధ్య రైల్వేకి చెందిన లింగంపల్లి-వికారాబాద్-వాడి మరియు వికారాబాద్-బీదర్ రైల్వేమార్గాల్లో 250 కి.మీ. ప్రయాణం చేస్తూ కవచ్ మీద ట్రయల్స్ వేశారు.
ట్రయల్స్ విజయవంతం అవ్వడంతో ఇండియన్ రైల్వే నెట్వర్క్ లో ఈ వ్యవస్థను తీసుకు వచ్చేందుకు ఆమోదం లభించింది. 16.88 కోట్లు ఖర్చు పెట్టి కవచ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. న్యూ ఢిల్లీ-హౌరా, న్యూ ఢిల్లీ-ముంబై రైలు మార్గాల్లో ఈ కవచ్ వ్యవస్థను 2024 మార్చి నెలలో అమలులోకి తీసుకురానున్నారు. ప్రయాణంలో ఉండగా లోకోపైలట్ రెడ్ సిగ్నల్ ను గుర్తించలేకపోయినా, సిగ్నల్ దాటేసినా, ఎదురెదురుగా రైళ్లు ఒకే ట్రాక్ పై వస్తున్నా, పరిమితి మించిన వేగంతో రైళ్లు వెళ్లినా, రైలు వేగాన్ని లోకోపైలట్ నియంత్రించలేకపోయినా ఈ కవచ్ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది.