జీవితం అంటేనే ప్రయాణం. ఒక చోట నుంచి మరొక చోటకి ప్రయాణం చేయకపోతే పనులు అవ్వవు. అప్పుడప్పుడూ దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమందికి దూర ప్రయాణాలు పడవు. బస్సులో గానీ, రైలులో గానీ, కారులో గానీ ప్రయాణం చేసినప్పుడు కొందరికి తల తిరిగినట్టు, వికారంగా ఉంటుంది. దీని వల్ల వాంతులు అవుతాయి. ఎక్కువగా బస్సులో ప్రయాణం చేసే వారికి వాంతులు అవుతాయి. పెద్దలే కాకుండా చిన్న పిల్లలు కూడా వాంతులు చేసుకుంటారు. బస్సు ఆపమని అడగాలంటే మొహమాటం. వాంతులొస్తే కిటికీలోంచే కక్కేస్తారు. పాపం అది అప్పుడే బస్సు పక్క నుంచి బైక్ మీద వెళ్తున్న మనిషి మీద పడుతుంది. ‘యో చూసుకోబడలే’ అంటూ ఆ మనిషి తిట్టుకుంటాడు. తప్పు చేసామన్న ఫీలింగ్ ఒకవైపు.. కానీ ప్రయాణం పడకపోవడం నా తప్పు కాదని సమర్ధింపు ఫీలింగు మరొక వైపు ఉంటుంది. అసలు వాంతులు ఎందుకు అవుతాయో తెలుసుకుంటే.. వాంతులు ఎలా అవుతాయో నేనూ చూస్తా అని ఒక ఛాలెంజ్ చేయచ్చు.
ప్రయాణం చేసే ప్రతీ ముగ్గురిలో ఒకరికి వాంతులు అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొందరికి బస్సు ఎక్కగానే వాంతులు ఐతే.. కొందరికి కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత అవుతాయి. కొందరికి బస్సులో వచ్చే చెడు వాసన పడకపోవడం వల్ల కూడా వాంతులు అవుతాయి. ఈ విషయంలో మగవారి కంటే ఆడవారికే ఎక్కువ వాంతులు అవుతాయి. అయితే ఆడవారికైనా, మగవారికైనా ప్రయాణాల్లో తల తిరుగుతున్నట్లు అనిపించడం, వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం వెనుక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ప్రయాణంలో వాంతులు అవ్వడాన్ని మోషన్ సిక్నెస్ అంటారు. కదలికలు అనేవి శరీర అవయవాలను డిస్టర్బ్ చేస్తుంది. కుదుపుల వల్ల కావచ్చు, వేగంగా వెళ్లడం వల్ల కావచ్చు, బస్సులో వచ్చే వాసనల వల్ల కావచ్చు.. వాంతులు అవుతుంటాయి.
మరి మిగతా వారు బాగానే ప్రయాణం చేస్తున్నారు కదా.. వాళ్ళకి లేని వికారం, వాంతులు మాకే ఎందుకు వస్తున్నాయని అనిపించవచ్చు. దీనికి కారణం చెవిలో ఉండే ల్యాబిరన్ థైటిస్ అనే అవయవం. ఇది ఇన్ఫెక్షన్ కి గురైనప్పుడు వికారం, వాంతులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో చెవుడు కూడా వచ్చే అవకాశం ఉంది. ల్యాబిరన్ థైటిస్ ఇన్ఫెక్షన్ కి గురవ్వడం వల్లే ప్రయాణ సమయాల్లో అది డిస్టర్బ్ అవుతుంది. ప్రయాణం చేసేటప్పుడు గాలి చెవుల్లోకి వెళ్లడం వల్ల ల్యాబిరన్ థైటిస్ పై ఒత్తిడి పడుతుంది. ఈ కారణంగానే వికారం అనిపించి.. వాంతులు అవుతాయి. అందుకే కొంతమంది ప్రయాణాల్లో చెవులకు గుడ్డ కప్పుకుంటారు. ఇక ల్యాబిరన్ థైటిస్ ఇన్ఫెక్షన్ కి గురవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి.
తరచూ స్నానం చేయకపోవడం, స్నానం చేసేటప్పుడు సబ్బు నురగ చెవుల్లో ఉండిపోవడం, చెవుల్లోకి నీరు చేరడం, ఏదైనా వస్తువుని చెవిలో పెట్టి తిప్పడం వంటివి వల్ల ల్యాబిరన్ థైటిస్ దెబ్బతింటుంది. ల్యాబిరన్ థైటిస్ శుభ్రంగా లేకపోతే.. మెదడుకి అందాల్సిన సంకేతాలు సరిగా అందవు. దీని వల్ల తల తిరగడం, వికారం అనిపించడం, వాంతులు అవ్వడం జరుగుతాయి. మరొక కారణం.. మానసికంగా బలహీనంగా ఉండడం. వాంతులు అవుతాయేమో అని భయంతో పదే పదే ఆలోచిస్తూ ప్రయాణం చేయడం వల్ల కూడా వాంతులు అవుతాయి. ప్రయాణం చేసే ముందు నూనె పదార్థాలు తినడం వల్ల వికారం కలుగుతుంది. తిన్న వెంటనే ప్రయాణం చేసినా, బస్సులో తిన్నా కూడా వాంతులు అవుతాయి.
వాంతులు అవ్వకుండా ఉండడం కోసం కొందరు చెవులను మూస్తారు. దీని వల్ల చెవులలోకి గాలి వెళ్ళదు. గాలి వెళ్ళకపోవడం వల్ల ల్యాబిరన్ థైటిస్ మీద ఒత్తిడి పడదు. కాబట్టి వికారం, వాంతులు ఉండవు. ఇంకొంతమంది నిమ్మకాయను వెంట తీసుకెళ్లారు. నిమ్మకాయ వాసన చూడడం వల్ల వికారం తగ్గుతుంది. నిమ్మకాయలో ఉండే ఎసిడిక్ యాసిడ్స్ ఉపశమనం కలిగిస్తాయి. కొంతమంది తల్లి జుట్టు వాసన చూస్తారు. అలా చూడడం వల్ల కూడా వికారం తగ్గుతుందని నమ్ముతారు. అయితే ఇది అందరిలో జరగకపోవచ్చు. ఇక వాంతులు అవుతాయి అన్న భయాన్ని మనసులోంచి తొలగించాలి. ప్రయాణం చేసేటప్పుడు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటే వాంతులు అవుతాయన్న ఫీలింగ్ ఉండదు.
కొత్త మనుషుల ముఖాలు చూస్తూ.. వారి ప్రవర్తన కనిపెడుతూ ఉండడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏమీ తినకుండా ప్రయాణం చేసినా వాంతులు అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా తినే ప్రయాణం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే అరగడానికి ఇబ్బందిగా ఉండే నూనె పదార్థాలను దూరం పెట్టాలని చెబుతున్నారు. సులువుగా జీర్ణమయ్యే పదార్థాలను తినాలని, అది కూడా ప్రయాణానికి గంట ముందు తినాలని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో మాత్రం ప్రయాణం చేస్తే.. నీరసం పెరుగుతుంది. పండ్ల రసాలు తాగితే కడుపు ప్రశాంతంగా ఉంటుంది. కొంతమందికి ఏసీ కారులో ప్రయాణం పడదు. కొంతదూరం కారులో ప్రయాణం చేయగానే వాంతులు అవుతాయి. దీనికి కారణం భోజనం తిన్న వెంటనే కారు ఎక్కడం, ఖాళీ కడుపుతో ప్రయాణం చేయడం. వాంతులు అవ్వకుండా ఉండాలంటే కారు లేదా బస్సులో ముందు సీట్లలో కూర్చోవాలి. విండో సీట్లో కూర్చుంటే ఉత్తమం.
కుదిరితే నిద్రపోవడం, కళ్ళు మూసుకోవడం లేదా మంచి నీళ్లు తాగుతూ ఉండాలి. కూల్ డ్రింక్ లు తాగకపోవడమే మంచిది. ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. ప్రయాణానికి ముందు పొగ తాగకపోవడమే మంచిది. సంగీతం వినడం వల్ల ఆలోచనలను పక్కదారి పట్టించవచ్చు. పుల్లని చాక్లెట్లు, అల్లం మిఠాయిలు తినడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. మరి వాంతులు అవ్వడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నారు కదా. వాంతులు అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. బస్సుల్లో, రైళ్లలో, కార్లలో ప్రశాంతంగా ప్రయాణం చేయండి. ఈ విషయాన్ని తోటి మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలానే ప్రయాణ సమయాల్లో వాంతులు అవ్వడానికి కారణాలు ఏమైనా మీకు తెలిసినవి, వాంతులు అవ్వకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చిట్కాలు ఉంటే కామెంట్ చేయడం ద్వారా సోషల్ మీడియా మిత్రులకు సహాయం చేయండి.