ఆకాశంలో పక్షుల గుంపులు వి ఆకారంలో ఎగురుతుంటాయి. ఇలా ఎందుకు ఎగురుతాయో మీకు తెలుసా?
ఆకాశంలో పక్షులు ఎగురుతున్నపుడు చూసే ఉంటారు. అవి ఒక గుంపులా ఏర్పడి ఒక క్రమపద్ధతిలో ఎగురుతాయి. ఆహారం కోసం లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడో అవి ‘వి’ ఆకారంలో ఏర్పడి ఎగురుతుంటాయి. ఈ పక్షులకు ఒక పక్షి నాయకత్వం వహిస్తూ ఉంటుంది. ఒకదాని వెనుక ఒకటి క్యూ కడుతూ ఎగురుతుంటాయి. వాటిని చూసినప్పుడు వి ఆకారంలో కనిపిస్తాయి. అయితే అవి అలా ఎందుకు ఎగురుతాయి? వాటికి ఎవరైనా చెప్పారా అలా ఎగరమని. పోనీ పక్షి నాయకుడు ఏమైనా చెప్తాడా, ఇలానే ఎగరండి అని. మనుషులకే క్రమశిక్షణ ఉండట్లేదు. అలాంటిది పక్షులు ఇంత క్రమశిక్షణగా ఎలా ఉంటున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి ఇలా ఎగరడానికి రెండు కారణాలు ఉన్నాయి. పక్షుల గుంపు వి ఆకారంలో ఎందుకు ఎగురుతాయో పరిశోధనలో తేలింది.
పక్షుల గుంపులు ఒక క్రమపద్ధతిలో ఒక దాని తర్వాత మరొకటి క్యూ కట్టి ఎగరడానికి కారణం పక్షి నాయకుడు. ఆ నాయక పక్షి ఎగురుతూ మిగిలిన పక్షులకు దిశా నిర్దేశం చేస్తుంటుంది. పక్షి నాయకుడు ముందు ఎగురుతుంటే.. వెనుక మిగతా పక్షులు ఎగురుతుంటాయి. చాలా మంది పరిశోధకులు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. మరొక కారణం ఏంటంటే.. వి ఆకారంలో అవి సులభంగా ఎగురుతాయి. ఒకదానితో ఒకటి ఢీకొనకుండా ఉండడం కోసం అవి ఇలా ఒకదాని వెనుక ఒకటి ఎగురుతూ ఉంటాయి. అంతేకాదు ఇలా ఎగరడం వల్ల తమ శరీరంలో శక్తి తక్కువ ఖర్చు అవుతుంది. స్క్వాడ్రన్ విమానాలు వి ఆకారంలో ప్రయాణించడం వల్ల ఇంధన ఖర్చు తగ్గుతుంది.
వలస పక్షులు కూడా ఇదే టెక్నిక్ ని అనుసరిస్తాయని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన రాయల్ వెటర్నరీ కాలేజ్ పరిశోధనలో తేలింది ఏంటంటే.. వి ఆకారంలో ఎగిరినప్పుడు ఎదురుగా వచ్చే గాలిని ఎదుర్కోవడం వాటికి సులభమవుతుంది. దీని వల్ల వాటి శక్తి ఎక్కువ ఖర్చవ్వదు. ఇవి వి ఆకారంలోనే కాదు, జే ఆకారంలో, రివర్స్ వి, రివర్స్ జే ఆకారాల్లో కూడా ఎగురుతాయి. ఇలా ఏర్పడడాన్ని స్కీన్ ఫార్మేషన్ అని అంటారు. అదన్నమాట విషయం.. పక్షులు వి ఆకారంలో ఎగరడానికి మూల కారణం అవి స్మార్ట్ గా ఆలోచించడమే. ఏ జీవి అయినా ఎక్కువ కష్టపడడానికి ఎందుకు ఇష్టపడతారు. మనుషులు ఎలానో మిగతా జీవులు కూడా అంతే.