వారాంతపు సెలవులలో కుర్రకారు యువత, ఉద్యోగులు, ఎక్కువగా రిలాక్స్ అవ్వడానికి పబ్ లకు వెల్తుంటారు. పబ్ ల్లో మందు కొట్టడం, డ్యాన్స్ లతో తెగ ఎంజాయ్ చేస్తారు. అయితే ఓ దేశంలో మాత్రం వీకెండ్ లో పబ్ లకు వెళ్లడం కంటే ఎక్కువగా వారి ఆఫీసులోనే సేదతీరేందుకు ఆవిరి స్నానపు గదులను ఏర్పాటు చేశారు. మరి ఆ స్నానపు గదుల్లో నగ్నంగా సహోద్యోగులు, బాస్ తో కలిసి రిలాక్స్ అవుతుంటారు. దీనిపై స్కాట్ లాండ్ కు చెందిన లెన్నాక్స్ మారిసన్ అనే జర్నలిస్ట్ ఓ కథనాన్ని రాశారు. వారాంతాల్లో మందుతాగడం, జల్సాలు చేయడం మామూలే కానీ బట్టలు విప్పేసి, ఆరుబయట కూర్చుంటానని తను ఊహించలేదని లెన్నాక్స్ తెలిపారు. మరి దీని వెనుక ఉన్న కథేంటో చూద్దాం..
కార్యాలయాల్లోనే సానాలు.. అందులోనే స్నానాలు
ఫిన్లాండ్ దేశంలో ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా అందరూ సమానమే అనే భావనతో ఉంటారు. కట్టుబాట్లు ఏమీ ఉండవు. ఆఫీస్ బాస్ తో కలిసి నగ్నంగా కూర్చుని మాట్లాడుకోవడం ఇక్కడ సాధారణంగా జరిగుతుంది. 55 లక్షల జనాబా ఉన్న ఈ దేశంలో ప్రతి ఇద్దరికి కలిపి ఒక ఆవిరి స్నానాల గది ఉంటుంది. దీన్నే సానా అని పిలుస్తారు. చాలా కంపెనీలు తమ కార్యాలయాల్లో వీటిని నిర్మించుకున్నాయి. వీటిలోకి వెళ్లాలంటే మాత్రం ఒంటిపై ఉన్న బట్టలు తొలగించుకోవాల్సిందే. ఆవిరి స్నానాల గదిలో హోదాలు ఏమి ఉండవని హెల్సింకిలోని ఫిన్నిష్ సానా సొసైటీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ కటారినా స్టిర్మన్ తెలిపారు.
ఈ వింతైన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయానని, బట్టలు తీసేసి మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడినని బెల్జియంకు చెందిన క్రిస్టాఫ్ మిన్నెర్ట్ చెప్పారు. అయితే కొంత కాలం గడిచిన తరువాత దీనికి అలవాటు పడిన తరువాత ఆవిరి స్నానాల గదిలో తన టీమ్ తో గడుపుతున్నానని తెలిపాడు. ఆ గదుల్లో నగ్నంగా కూర్చోని ఆపీసు కు సంబంధించిన పనుల గురించి చర్చించుకుంటామని మిన్నెర్ట్ తెలిపాడు.
ఫిన్లాండ్ దేశంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కడి వారు ఆవిరి స్నానాలను ఇష్టపడతారు. పని ఒత్తిడిని మర్చిపోయేలా సానాలో వెచ్చటి ఆవిరి స్నానంతో కొత్త ఉత్సాహం వస్తుందని ఉద్యోగులు చెప్తున్నారు. ఫిన్లాండ్‌లో మొబైల్‌ఫోన్ల కంపెనీ నోకియాకు చెందిన కార్యాలయాల్లో కూడా సానాలున్నాయి. ఇలా బట్టల్లేకుండా స్నానం చేయటం అంటే ఎటువంటి ఆర్బాటాలు లేకుండా మనిషిని మనిషికి దగ్గర చేయటమే అని నోకియా కంపెనీ గ్లోబల్ ప్రొడక్ట్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టామీ ఉట్టొ చెప్పారు. అయితే కొన్నేళ్లుగా ఒంటిపై బట్టల్లేకుండా ఆవిరి స్నానాల గదుల్లో మాట్లాడుకునే సంస్కృతి తగ్గుతోంది. దీనికి గల కారణం ఫిన్లాండ్‌లోని కంపెనీలన్నీ గ్లోబల్ కంపెనీలుగా మారుతుండటం, విభిన్నదేశాల వారు, విభిన్న మతాలకు చెందినవాళ్లు వీటిలో పనిచేస్తుండటమే.
జర్మనీ, ఫిన్లాండ్‌లతో పాటు స్వీడన్, రష్యా, నెదర్లాండ్స్‌ల్లో కూడా సానాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆవిరి స్నానాల గదుల్లో నియమ నిబంధనలు మాత్రం దేశ దేశానికి మారుతుంటాయి. ఫిన్లాండ్ దేశంలో సరదా కోసం సానాకు వెళితే, జర్మనీలో ఆరోగ్యం కోసం వెళుతుంటారు. అయితే కొన్ని సానాల్లో హెల్పింగ్ మాస్టర్లు కూడా ఉంటారు. జర్మనీ, నెదర్లాండ్స్‌ల్లో ఆఫీస్ పని ముగిసాక సహోద్యోగులతో కలిసి ఆటలు ఆడి, ఆ తర్వాత సానాలకు వెళుతుంటారు. స్పోర్ట్స్‌క్లబ్‌లు, జిమ్‌ల్లో కూడా సానాలు ఉంటాయి. మరి ఈ వింతైన సానా స్నానపు గదుల పట్ల మీ అభిప్రాయమేంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.