పప్పు అనేది ఒక ఎమోషన్. తెలుగు వారు ఎంతో ఇష్టంగా భోజనంలో కలుపుకుని తినే కూర. ఎన్ని కూరలు ఉన్నా పప్పు అనేది కామన్ గా ఉండాలి. పప్పు, పప్పు టమాటా, పప్పు చారు, ముద్ద పప్పు ఇలా రకరకాలుగా వండుకుని ఆవురావురమంటూ తింటారు. ముద్ద పప్పు, ఆవకాయ కాంబినేషన్ లో భోజనం అంటే చెప్పక్కర్లేదు. ఈ కాంబినేషన్ ని ఎప్పుడు పడితే అప్పుడే సెట్ చేయవచ్చు. డేట్స్, కాల్షీట్స్ తో అసలు సమస్యే ఉండదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయచ్చు. ఇక ఈ పప్పులో నెయ్యి వేసుకుని తింటే ఉంటాది అబ్బబ్బా.. మళ్ళీ జన్మలో కూడా మనిషిగానే పుట్టాలని కోరుకునేంత రుచిగా ఉంటుంది. అయితే ఈ పప్పుని గాయం అయినప్పుడు తినకూడదు, చీము పడుతుంది అని అంటారు. గాయాలైనప్పుడు పప్పు తింటే నిజంగానే చీము పడుతుందా? అసలు చీము ఎందుకు పడుతుంది? అదేంటో తెలుసుకుందాం పదండి.
గాయం అయినప్పుడు.. ఆ గాయమైన రంధ్రం నుంచి రోగానికి కారణమయ్యే హానికర బ్యాక్టీరియాలు, పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు సరిహద్దుల్లోకి వచ్చిన యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ తో శరీరంలో ఉన్న తెల్ల రక్తకణాలు పోరాడతాయి. కానీ హానికరమైన బ్యాక్టీరియాలు, పరాన్నజీవులు బలంగా ఉండడంతో.. వాటి ముందు తెల్ల రక్త కణాలు ఓటమికి గురవుతాయి. ఈ చనిపోయిన తెల్ల రక్త కణాలే ఆ గాయం దగ్గర చీములా ఏర్పడతాయి. ‘హానికర బ్యాక్టీరియాలు మిమ్మల్ని మింగేశాయని విర్రవీగుతున్నాయి.. కానీ మీ స్థానాన్ని గెలిపించుకోవడానికి మళ్ళీ తిరిగొస్తారు తెల్ల రక్త కణాల్లారా.. తిరిగొస్తారు’ అంటూ గాయం ఇచ్చే మోటివేషన్ కి తెల్ల రక్త కణాలు మళ్ళీ పుట్టుకొస్తాయి. ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే.. పోషక విలువలు ఉన్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ల నుంచే.
ఈ రెండూ అధికంగా ఉన్న ఆహారం పప్పే. అలాంటిది పప్పు తింటే చీము పడుతుందని అంటున్నారు ఈ మాయదారి మనుషులు. ఉడికించిన పప్పు తింటే గాయమైనా సరే చీము పట్టదు. పైగా గాయం కూడా త్వరగా మానిపోతుంది. ఇంకా పప్పు తినకపోతేనే చీము పడుతుంది. మరి గాయమైనప్పుడు పప్పు తింటే చీము పడుతుందని మానేస్తే.. పోషకాలు అందక చీము పడుతుంది. పప్పు మాత్రమే కాదు, ఏ ఆహార పదార్థాలు తిన్నా చీము పట్టదని నిపుణులు చెబుతున్నారు. అయితే పప్పు, వేరుశనగ వంటివి బలమైన ఆహారం కాబట్టి.. అనారోగ్యంగా ఉన్నప్పుడు తింటే త్వరగా అరగదని తినవద్దు అని చెబుతారు. కానీ నిజానికి ఈ పప్పు, ఇతర కూరల వల్ల చీము అయితే పట్టదు.