2 సెం.మీ., 5 సెం.మీ.వర్షపాతం నమోదైందని అంటారు. ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అసలు వర్షాన్ని ఎలా కొలుస్తారు? ఎన్ని సెం.మీ. వర్షపాతం నమోదైతే రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేస్తారు? మోస్తరు, భారీ, అతి భారీ వర్షాలను ఎలా లెక్కిస్తారు?
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమవ్వడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గంట పాటు వర్షం కురిస్తే ఆయా వీధులు, రోడ్లు మునిగిపోయే పరిస్థితి. 5 సెం.మీ. వర్షానికే కాలనీలు మునిగిపోతున్నాయి. అది సరే 5 సెం.మీ. వర్షం అంటే ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా? వర్షం పడినప్పుడు 10 సెం.మీ. వర్షపాతం నమోదైందని, 20 సెం.మీ. వర్షపాతం నమోదైందని అంటారు. అసలు ఈ వర్షపాతాన్ని సెం.మీ. లలో ఎలా కొలుస్తారో అని ఎప్పుడైనా ఆలోచించారా? సెం.మీ. లతో వర్షాన్ని ఎలా కొలుస్తారు? ఏముంది ఒక స్కేల్ ని తీసుకెళ్లి వర్షం పడ్డ బురద గుంటలో ముంచేస్తే సరి అని అనుకుంటున్నారా? వర్షపాతాన్ని లెక్కించడానికి కొన్ని ప్రామాణిక పద్ధతులు ఉన్నాయి.
వర్షపాతాన్ని అంచనా వేయడం అనేది పురాతన కాలం నుంచే ఉంది. 3 వేల ఏళ్లకు ముందు రాసిన చందోయా ఉపనిషత్తులో మేఘాల నిర్మాణం, వర్షాలు, సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయంలో ఏర్పడే ఋతువుల గురించి పేర్కొన్నారు. వరాహమిహిర రాసిన బృహత్ సంహితలో వాతావరణం గురించి స్పష్టంగా ఉంటుంది. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వర్షపాతాన్ని కొలిచే విధానాల గురించి తెలుపబడింది. మధ్య భారతదేశంలో వర్షాలు రుతుపవనాలు ఎప్పుడు మొదలవుతాయి అనే దాని గురించి కాళిదాసు రాసిన మేఘదూత అనే కథలో వివరించారు. ప్రస్తుతం అయితే ఐఎండీ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గాజ్ లాంటి పరికరాలను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. ఈ సమాచారాన్ని నేషనల్ క్లైమేట్ సెంటర్ కు పంపిస్తారు.
వర్షపాతం అంచనా వేయడంలో పీడనం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పీడనం ఏర్పడడంలో ఉష్ణోగ్రత కీలక పాత్ర వహిస్తుంది. పీడనాన్ని బారోమీటర్, ఉష్ణోగ్రతను థర్మోమీటర్ తో కొలుస్తారు. రెయిన్ గాజ్ ను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. గాజు సీసాలో ఒక గాజు గరాటు ఉంటుంది. దీని మీద మిల్లీమీటర్, సెంటీమీటర్ కొలతలు ఉంటాయి. వర్షం పడినప్పుడు గరాటు ద్వారా నీళ్లు గాజు సీసాలోకి వెళ్తాయి. ఆ నీళ్లు ఎంత ఎత్తున చేరితే అన్ని సెం.మీ. లేదా అన్ని మి.మీ. వర్షం పడినట్లు. ఉదాహరణకు గరాటులో ఉన్న 10 సెం.మీ. కొలతకు వర్షం నీరు చేరితే 10 సెం.మీ. వర్షపాతం నమోదైందని చెబుతారు. ఈ లెక్కల ఆధారంగా వర్షాన్ని తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షం, భారీ, అతి భారీ వర్షాలుగా పిలుస్తారు.
15.6 మి.మీ. లేదా 1.56 సెం.మీ. నుంచి 64.4 మి.మీ. లేదా 6.44 సెం.మీ. వర్షపాతం నమోదైతే దాన్ని మోస్తరు వర్షం అని అంటారు. 64.5 మి.మీ. లేదా 6.45 సెం.మీ. వర్షపాతం నమోదైతే దాన్ని భారీ వర్షంగా పరిగణిస్తారు. 115.6 మి.మీ. లేదా 11.56 సెం.మీ. వర్షపాతం నమోదైతే దాన్ని అతి భారీ వర్షం అంటారు. 20.45 సెం.మీ. లేదా 204.5 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని కుంభవృష్టి అంటారు. ఈ వర్షపాతాన్ని కొలిచే రెయిన్ గాజ్ లను చెట్ల కింద, భవనాల సమీపంలో, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయరు. విశాలంగా ఉండే ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. అప్పుడైతేనే ఖచ్చితమైన లెక్కలు వస్తాయి. ఈ లెక్కల ఆధారంగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది.
గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ లను పంపిస్తుంది. రెడ్ అలర్ట్ అంటే రాగల 24 గంటల్లో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని అర్థం. అంటే 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. అధికారులు సిద్ధంగా ఉండాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. పరిస్థితులను జాగ్రత్తగా గమనించమని చెప్పడానికి ఈ ఎల్లో అలర్ట్ సూచిస్తుంది. ఇక తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటే గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు. గ్రీన్ అలర్ట్ అంటే నో వార్నింగ్ గా చెబుతారు. ఈ అలర్ట్ ఇచ్చినప్పుడు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.