మనలో చాలా మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. ఇది మాకు మామూలే అని జనం కూడా అలవాటైపోయారు. ‘రైలు రైలు రైలుబండి వేళకంటూ రాదులెండి.. దీన్ని గనుక నమ్ముకుంటే అంతేనండి అంతేనండి’ అంటూ సెటైరికల్ సాంగ్ కూడా గతంలో వచ్చింది. రైల్వే శాఖ కన్నెర్ర చేయడంతో ఆ పాటను మార్చేశారు కానీ తమ పద్ధతిని మాత్రం మార్చుకోలేదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఇప్పటికీ చాలా రైళ్లు ఆలస్యంగానే వస్తున్నాయి, ఆలస్యంగానే గమ్యానికి చేరుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుడి పనుల్లో ఆలస్యం జరుగుతుంది. దీని వల్ల నష్టపోయే ప్రయాణికులు కూడా ఉన్నారు.
ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు. గమ్య స్థానంలో వేరే బస్సునో, రైలునో లేదా విమానాన్నో క్యాచ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ రైలు ఇక్కడ ఆలస్యం చేస్తుంది. దీని వల్ల ఆ వ్యక్తి ట్యాక్సీలో వెళ్లడమో.. ఇంకేదో పట్టుకుని వెళ్లడమో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైందా? అయితే ఈ ఆలస్యం వల్ల మీరు నష్టపోయిన దానికి పరిహారం పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? అవును మీరు ఎక్కాల్సిన రైలు ఆలస్యంగా వచ్చినా, ఎక్కిన రైలు ఆలస్యం చేసినా.. మీకు జరిగిన నష్టానికి రైల్వే శాఖ బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లిస్తుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైళ్లు ఆలస్యం చేస్తున్నందుకు సుప్రీంకోర్టు మొదటిసారిగా భారతీయ రైల్వేస్ ని గతంలో తప్పుబట్టింది.
ఒక వ్యక్తి రైలు ఆలస్యం చేయడం వల్ల తనకి నష్టం జరిగిందని ఫిర్యాదు చేస్తే.. సుప్రీంకోర్టు ఇండియన్ రైల్వేస్ పై మొట్టికాయలు చేసింది. షాహ్ మరియు అనిరుద్ధ బోస్ ధర్మాసనం ఈ మేరకు రూ. 30 వేలు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇది 2016లో జరిగింది. జూన్ 11న సంజయ్ శుక్ల అనే వ్యక్తి రాజస్థాన్ నుంచి జమ్మూకి కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణం చేస్తున్నారు. జమ్మూ నుంచి శ్రీనగర్ కి విమానంలో వెళ్లాల్సి ఉంది. విమానాన్ని అందుకోవాలంటే జమ్మూలో ఉదయం 8.10 కి ఉండాలి. అయితే ఈయన ఎక్కిన రైలు 4 గంటలు ఆలస్యం చేసింది. దీని వల్ల అతను మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లాల్సి వచ్చింది. దీని వల్ల అతను ఫ్లైట్ మిస్ అయ్యారు.
దీంతో చేసేదేమీ లేక అతను ట్యాక్సీ పట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. దీని కోసం అతను రూ. 15 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. శ్రీనగర్ లో ఉండడానికి లాడ్జికి మరో రూ. 10 వేలు ఖర్చయ్యాయి. మానసికంగా ఆరోజంతా ఒత్తిడి, ఇబ్బందికి గురయ్యారు. ఆయన పనులు ఆలస్యం అయ్యాయి. కొంత నష్టం కూడా జరిగింది. దీంతో విసిగిపోయిన ఆయన కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఎందుకు ఆలస్యం జరిగిందో అని ఇండియన్ రైల్వేస్ ని వివరణ అడగ్గా.. రైల్వే వారు సరైన కారణం చెప్పలేకపోయారు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికుల సమయం చాలా విలువైందని, రైలు ఆలస్యానికి జవాబుదారీతనం ఉండాలని కోర్టు పేర్కొంది.
ఇవి పోటీకి, జవాబుదారీతనానికి రోజులని, పబ్లిక్ రవాణా సంస్థలు మనుగడ సాధించాలంటే ప్రైవేట్ సంస్థలతో పోటీ పడాల్సి ఉంటుందని, రైల్వే సిస్టంను, పని సంస్కృతిని మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పౌరులు లేదా ప్రయాణికులు ఈ విషయంలో అధికారులు మరియు అడ్మినిస్ట్రేషన్ వారి దయ మీద బతకాల్సిన అవసరం లేదని.. ఎవరో ఒకరు వారికి సమాధానం చెప్పాలని తీర్పు ఇచ్చింది. నార్త్ వెస్టర్న్ రైల్వేకి కోర్టు 30 వేలు పరిహారం విధించింది.
శుక్ల అనే ప్రయాణికుడికి ట్యాక్సీ ఖర్చులు రూ. 15 వేలు, శ్రీనగర్ లో ఉండాల్సి వచ్చినప్పుడు లాడ్జ్ బుకింగ్ ఖర్చులు రూ. 10 వేలు, మానసిక వేదనకు, వ్యాజ్యం ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ. 5 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. అలా నార్త్ వెస్టర్న్ రైల్వే వారు శుక్ల అనే ప్రయాణికుడికి రూ. 30 వేలు చెల్లించవలసి వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసినప్పుడు ఆలస్యం అయ్యి..సరైన వివరణ ఇవ్వకపోతే గనుక పరిహారం అడగవచ్చు. ఇవ్వకపోతే గనుక కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.