సూపర్ మార్టులకి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగులకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే లోగోతో ఉన్న క్యారీ బ్యాగ్స్ సూపర్ మార్టులు ఉచితంగా ఇస్తాయని. ఉచితంగా ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చునని తెలుసా? నష్ట పరిహారం కూడా పొందవచ్చు.
మధ్యతరగతి, కాస్త డబ్బున్న వారు అని తేడా లేకుండా అందరూ సూపర్ మార్టుల్లో కావాల్సిన సరుకులు కొనుక్కుంటున్నారు. ఐతే కొంతమంది క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్తారు. కొంతమంది మార్ట్ లలో ప్రత్యేక ధర చెల్లించి కొనుక్కుంటారు. మార్టుని బట్టి, బ్యాగ్ సైజుని బట్టి దాని ధర అనేది ఉంటుంది. రూ. 5, రూ. 10, రూ. 20 ఇలా క్యారీ బ్యాగ్స్ కోసం ఛార్జీలు వసూలు చేస్తుంటారు. అయితే మీకు తెలుసా? క్యారీ బ్యాగ్ ల విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని. మీరు గమనించారో లేదో మీరు సరుకులు తీసుకెళ్లే క్యారీ బ్యాగులు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం ప్లెయిన్ క్యారీ బ్యాగ్, రెండవది కంపెనీ లోగోతో ఉన్న క్యారీ బ్యాగ్. ప్లెయిన్ క్యారీ బ్యాగుల కోసం కంపెనీ కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. అయితే కంపెనీ లోగో ప్రింట్ చేసి ఉన్న క్యారీ బ్యాగుల కోసం డబ్బులు ఛార్జ్ చేయకూడదు. అది చట్టరీత్యా నేరమని మీకు తెలుసా? వాటిని వినియోగదారులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా డబ్బులు వసూలు చేస్తే గనుక మీరు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు.
వినియోగదారుల రక్షణ చట్టం (కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్) 1986 ప్రకారం.. అన్యాయమైన వాణిజ్య ఆచరణ (అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్) అంటే తమ బ్రాండ్ ని గానీ, తమ సేల్స్ ని గానీ ప్రచారం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఇదే విషయం మీద గతంలో కొంతమంది కొన్ని సూపర్ మార్టుల మీద ఫిర్యాదు చేశారు. తమని మోసం చేస్తున్నాయంటూ కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయడంతో సదరు కంపెనీలపై జరిమానా విధించడం జరిగింది. ఆ మధ్య హైదరాబాద్ లోని ఒక సూపర్ మార్కెట్ తమ కస్టమర్ కి లోగో ప్రింట్ చేసి ఉన్న క్యారీ బ్యాగ్ కి ఛార్జీ వసూలు చేసింది. కస్టమర్ ఫిర్యాదు మేరకు ఆ సూపర్ మార్కెట్ పై కన్స్యూమర్ ఫోరం రూ. 15 వేలు జరిమానా విధించింది.
అంతేకాదు గతంలో బిగ్ బజార్ పై (ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్) సాహిల్ దావర్ అనే వ్యక్తి తనకు కంపెనీ లోగోతో ఉన్న క్యారీ బ్యాగ్ ని అమ్మిందని చెప్పి కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో బిగ్ బజార్ కంపెనీ సదరు కస్టమర్ కి క్యారీ బ్యాగ్ కి ఛార్జ్ చేసిన డబ్బుతో పాటు రూ. 100 పరిహారం చెల్లించింది. రూ. 5 వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. లోగోతో ఉన్న క్యారీ బ్యాగ్స్ కి డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది? అదేమైనా పెద్ద నేరమా? అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు తెలియకుండానే ఆ కంపెనీ బ్రాండ్ ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టు లెక్క. మీరు ఆ క్యారీ బ్యాగ్ ని ఎన్నో రకాలుగా వాడతారు. ఎక్కడకి తీసుకెళ్లినా దాన్ని వెంట తీసుకెళ్తారు. ఇంటికి ఎవరైనా వస్తే వారికి అవసరం వస్తే ఇస్తారు.
ఇలా మీ చుట్టూ ఉన్న వారికి ఉచితంగా కంపెనీని ప్రమోట్ చేయడానికైనా మనం ఉన్నది. అది కూడా మనమే క్యారీ బ్యాగులకి డబ్బులు చెల్లించి ఉచితంగా ప్రమోట్ చేస్తున్నాం. ఇది నిజంగా వెర్రితనం, కంపెనీ వారి మోసం కూడాను. కాబట్టి ఇక నుంచి లోగో ఉన్న క్యారీ బ్యాగులకు డబ్బులు తీసుకుంటే గనుక కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయండి. మీ దగ్గర ఎన్ని క్యారీ బ్యాగులు ఉంటే అన్నిటి మీద పరిహారం చెల్లిస్తుంది. సూపర్ మార్టులైనా, ఏ షాపింగ్ కంపెనీలు అయినా సరే తమ లోగోతో ఉన్న క్యారీ బ్యాగులను ఉచితంగా అయినా ఇవ్వాలి లేదా క్యారీ బ్యాగుల మీద లోగో తొలగించి అయినా ఇవ్వాలి. లేదంటే అది చట్టరీత్యా నేరం. మరి ఈ విషయాన్ని మీ స్నేహితులకు, సన్నిహితులకు, బంధువులకు షేర్ చేయండి. క్యారీ బ్యాగుల విషయంలో కంపెనీలు చేసే మోసాలకు దూరంగా ఉండండి.