తల్లి తదనంతరం గురించి మాట్లాడుకోవడమే ఒక పాపం. తల్లి బతికుండగా ఆమె నగలు, ఆమె దాచుకున్న డబ్బు ఎవరికి చెందుతుంది అని లెక్కలు వేసుకోవడం అనేది పాపపు పని. అయితే ఇప్పుడున్న ఆర్థిక వైకల్య పరిస్థితుల్లో దీని మీద అవగాహన ఉండి తీరాలి. అమ్మ బంగారం, అమ్మ దాచుకున్న డబ్బు నాకే చెందుతుంది, నాకే చెందుతుంది అని గొడవలు రాకుండా ఉండాలంటే దీని మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి. బంగారం అంటే ఆడవాళ్ళకి ఎంత మోజో అందరికీ తెలిసిందే. గ్రాము బంగారమైనా సరే వదులుకోవడానికి ఇష్టపడని ఆడవాళ్లు ఉంటారు. అయితే ఈ బంగారం, డబ్బు కంటే మనుషులే ముఖ్యం అనుకునే గొప్ప మనుషులు ఉండచ్చు. అలాంటి వాళ్లకి బంగారం, డబ్బు గడ్డి పరకతో సమానం.
కానీ బంగారమే జీవితం, డబ్బే శాశ్వతం అనుకునే మనుషులు ఉంటారు. అలా అని వీళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు. పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తాయి. ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండడం, ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం వంటి కారణాల వల్ల తల్లిదండ్రుల ఆస్తి మీద ఆఖరి నమ్మకం ఉంటుంది. ఇదేనా దక్కితే బాగుణ్ణు అని అనుకుంటారు. బాగా డబ్బున్న వాళ్ళకి ఈ బంగారం అది పెద్ద లెక్క కాదు. కాబట్టి వాళ్ళు దీని గురించి ఆలోచించే పని ఉండదు. అయితే పేద, మధ్యతరగతి కుటుంబంలో ఉండే వారికే అసలు సమస్య. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉండి కూడా ఇంకా బంగారం, డబ్బు మీద ఆశపడితే ఎవరూ ఏమీ చేయలేరు గానీ.. ఆర్థికంగా వెనుకబడి ఉంటే మాత్రం వారికి ఇదొక సమస్య.
అసలు తల్లి తదనంతరం ఆమె బంగారం ఎవరికి చెందాలి? కూతురికా? కోడలికా? ఈ సందేహాన్ని చట్టం, సాంప్రదాయం, మానవత్వ కోణాల్లో చూడాల్సి వస్తుంది. చట్ట ప్రకారం చూసుకుంటే.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ చెందుతుంది. కొడుకులు, కూతుర్లు ఉన్నా ఎంతమంది వారసులు ఉంటే అంతమందికీ చెందుతుంది. పొలం, ఇళ్ళు, స్థలాలు వంటి ఆస్తుల్లో సగం వాటా కొడుకుతో సమానంగా కూతుర్లకు చెందాలని చట్టం చెబుతుంది. అలానే బంగారం కూడా. అయితే చట్టం వరకూ ఎందుకు వెళ్లడం అని ఆలోచించేవారు ఉంటారు. సాంప్రదాయ కోణంలో ఆలోచిస్తే.. వృద్ధాప్యంలో సేవ చేసిన కొడుకు, కోడలికి చెందాలి అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే కూతురు అల్లుడి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె చూసే అవకాశం ఉండదని అంటారు. అందుకే కోడలికి చెందాలని చెబుతారు.
ఇలా అనడానికి మరో కారణం కూడా ఉంది. అప్పటికే కట్నం రూపంలో కొంత డబ్బు, ఆస్తి, బంగారం కూతురికి పెడతారు. ఇవన్నీ ఇచ్చాము కదా, ఇక మళ్ళీ అమ్మ బంగారం ఎందుకు అని అంటారు కూడా. సాంప్రదాయం ప్రకారం వెళ్తే.. సమాన వాటా అనేది ఉండదు. కొంతమంది అయితే అమ్మ బంగారం.. కూతుర్లకు చెందాలని అంటారు. ఒక్కొక్కరిదీ ఒక్కో సాంప్రదాయం. ఈ విషయంలో కోడళ్ళు గొడవ పడకూడదు. ఎందుకంటే వారికి వారి తల్లి నుంచి బంగారం వస్తుంది కాబట్టి. ఇంకొంతమంది కూతుర్లను, కోడళ్లను ఒకేలా చూసే తల్లులు ఉంటారు. వారి కూతుర్లకు, కోడళ్ళకు ఇద్దరికీ సమానంగా చెందాలని అంటారు. అయితే కూతురికి మాత్రమే ఇవ్వాలనుకోవడం, కోడలికి మాత్రమే ఇవ్వాలనుకోవడం, ఇద్దరికీ ఇవ్వాలనుకోవడం అనేవి పూర్తిగా ఆమె ఇష్టాలు.
దీన్ని కూతురైనా, కోడలైనా స్వీకరించాల్సిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులను కొడుకులు పట్టించుకోవడం లేదని.. చివరి దశలో తమను ఎవరు చూస్తే వారికే చెందేలా చేస్తున్నారు. ఇలా అనుకోవడంలో కూడా తప్పు లేదు. కూతురికి, కోడలికి బంగారం సమానంగా పంచేసి.. కొడుకు దగ్గరే జీవితం మొత్తం ఉంటే కొడుకు అన్యాయం అయిపోడు. కొడుకు ధనవంతుడు అయితే పర్లేదు. ఏ కూలి పని చేసుకునే వ్యక్తో, లేక ఏ చిరు ఉద్యోగో అయితే ఏంటి పరిస్థితి? అందుకే తల్లి తనని బాగా చూసుకుంటారన్న నమ్మకం కొడుకు మీద ఉంటే.. బంగారం కోడలికి ఇస్తుంది. కాబట్టి కూతుర్లు చట్ట ప్రకారం సాధించుకుంటాం అని కోర్టు మెట్లెక్కడం మానవత్వం అనిపించుకోదు.
కూతురి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటే గనుక తల్లి బంగారం మీద ఆశ పడకూడదు. పర్లేదు అన్న పరిస్థితుల్లో కూడా ఆశపడకూడదు. కోడలు ఎవరు, సోదరుడి భార్య. బయట వ్యక్తి కాదు కదా అన్న ఆలోచన ఉంటే మనిషిగా గుర్తింపు ఉంటుంది. కొడుకు, కూతురు ఇద్దరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే గనుక ఆ తల్లి ఇద్దరికీ ఇస్తే బాగుంటుంది. అప్పుడు కొడుకు, కూతురు ఇద్దరూ తల్లిని చూడాలి. తల్లిదండ్రులని చూడలేని వాళ్లకి వారి ఆస్తిని పంచుకునే హక్కు లేదు. ఆ బంగారం ఎవరు తీసుకుంటే వారు ఖచ్చితంగా తల్లిని చూడడం ధర్మం. ఇక మూడవది, మానవత్వ కోణంలో ఆలోచిస్తే.. బంగారం, డబ్బు శాశ్వతం కాదు. ఆర్థిక పరిస్థితి బాగున్నా, లేకున్నా.. అమ్మే ముఖ్యం. అమ్మే ఒక బంగారు గని అనుకుంటే ఆ కొడుకు గొప్పోడు అవుతాడు. అత్తగారు అయితే ఏంటి, తల్లి తర్వాత తల్లే కదా అని చూసుకుంటే ఆ అల్లుడు గొప్పోడు అవుతాడు.
ఇక్కడ బంగారం కంటే బంధాలు ముఖ్యం అని ఆడబిడ్డ ఆలోచిస్తే ఆమే ఒక అష్టలక్ష్మి అవుతుంది. మహాలక్ష్మి ఉన్న చోట ఎలాంటి గొడవలు ఉండవు. మహాలక్ష్మి అంటే మంచి మనసు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా జన్మనిచ్చారు కాబట్టి తల్లిదండ్రులను చూడడం అనేది ధర్మం. పిల్లల్ని సమానంగా చూడని తల్లిదండ్రులైనా, సమానంగా ఆస్తి పంచని తల్లిదండ్రులైనా సరే జన్మనిచ్చిన బంధానికి ఏమీ ఆశించకుండా వారి రుణం తీర్చుకునేవారు ఉత్తములు అవుతారు. రుణ బంధాన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తే కలహాలు ఉండవు. కల్మషం లేకుండా జీవిస్తే జీవితాలు బాగుంటాయి. మరి తల్లి తదనంతరం ఆమె బంగారం కూతురిగా, కోడలిగా తీసుకునేందుకు వారికి ఉన్న హక్కులు, బాధ్యతలు ఏమిటి? ఈ బంగారాన్ని వారసత్వంగా పొందాలన్న ఆలోచనపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.