‘నిను వీడని నీడను నేను..’’ అని తెలుగులో ఓ పాట ఉంది. నీడ ఎప్పుడూ మన వెంటనే ఉంటుందని, నీడలా వెంట ఉంటానని చెప్పటమే ఈ పాట ఉద్ధేశ్యం. అందుకే చాలా మంది నీడలా నీ వెంట ఉంటా అంటూ ఉంటారు.
ఏ వస్తువుకైనా, ఏ ప్రాణికైనా ఎండలో నిల్చున్నపుడు నీడ పడడం సహజం. నీడ ఉదయం పూట, సాయంత్రం పూట బారుగా కనబడుతుంది. అదే మిట్ట మధ్యాహ్నం సమయంలో నిలువుగా అంటే ఆ వస్తువు చుట్టూ మాత్రమే కన్పిస్తుంది. అయితే ఈరోజు హైదరాబాద్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. నగరవాసులకు అత్యంత అరుదైన రోజుగా మారింది. ఇవాళ రెండు నిమిషాలపాటు నీడ మాయం అయింది. జీరో షాడో డే సందర్భంగా ఈ అద్భుతం జరిగింది.
జీరో షాడో డే అంటే సూర్యుడు సరిగ్గా నడినెత్తిన వస్తాడు, నీడ ఎటూ పడకుండా నిలువుగానే ఉంటుంది. ఇలా జరగడానికి ఏదైనా కారణం ఉందా అంటే ఉందనే చెప్పాలి. భూమి కొంచెం పక్కకు వంగి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా పక్కకు వంగినప్పుడు 23.45 డిగ్రీల వరకు వంగి ఉంటుంది. ఈ వంపు వల్ల సూర్యకిరణాలు సంవత్సరం మొత్తం ఒకేలా భూమిపై పడవు. అందుకే ఒక్కో సమయంలో ఒక్కో చోట నోషాడో డే వస్తుంది. ఈ రోజు చాలా మంది నగరవాసులు జీరో షాడోను కళ్లారా వీక్షించారు.
ఇవాళ మధ్యాహ్నం 12.12 నిమిషాలకు హైదరాబాద్‌లో జీరో షాడో చోటుచేసుకుంది. ఈ సమయంలో ఎండలో నిల్చుని తమ నీడను చెక్ చేసుకున్న వారు ఆశ్చర్యపోయారు. వారికి తమ నీడ కనిపించలేదు. ఇది రెండు నిమిషాలు మాత్రమే జరిగింది. తర్వాత పరిస్థితులు సాధారణ స్థితిలోకి వచ్చాయి. మళ్లీ మధ్యాహ్నం 12.14 నిమిషాల నుంచి నీడ వచ్చింది. మరి, హైదరాబాద్‌లో చోటుచేసుకున్న జీరో షాడో డేపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.