తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తా అంటూ వైఎస్సార్‌టీపీ తో ముందుకు వచ్చారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి యువత మోసపోయారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ఈ విషయంలో దీక్ష చేసిన విషయం తెలిసిందే. తాజాగా షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు… అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెను మేడిపల్లి పీఎస్ కు తరలించారు. ఈ నేపథ్యం లో వైఎస్‌ఆర్టీపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య ఉద్రిక్తత నెలకొంది.
మొదటగా ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనుమతి నిరాకరించినా నగరంలోని బోడుప్పల్‌లో దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. అయితే పోలీసులు దీక్షకు అడ్డు చెప్పడంతో గందరగోళం నెలకొంది. తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు ఆమె మేడిపల్లి పీఎస్‌కు బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల, పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. ఈ విషయం తెలియడంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు భారీగా మేడిపల్లి పీఎస్‌కు చేరుకున్నారు. తర్వాత షర్మిలను పోలీసులు ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంతకుముందు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన షర్మిల.. వందలమంది నిరుద్యోగులను హత్యా చేసిన హంతకుడు కెసిఆర్ అని.. ఏళ్లుగా నిద్రపోయి ఇప్పుడు గర్జనలు అంటూ ప్రతిపక్షాలు ముందుకు వస్తున్నాయని నిప్పులు చెరారు. సొంత నియోజకవర్గంలో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించలేదని.. ఇక తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. తల్లికి గంజిపోయేలేనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానంటే ఎవరు నమ్ముతారని షర్మిల ఎద్దేవా చేశారు. తెలంగాణ లో కొంత మంది డబ్బుకు అమ్ముడు పోతున్నారని.. రాజకీయ ముసుగు తొడిగి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ కి కాంగ్రెస్, బీజేపీ అమ్ముడుపోయాయన్నారు. అందుకే సరైన ప్రతిపక్షంగా నిలవలేకపోతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు అండగా తానుంటానని… దీక్షకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు అనుమతులు లేవు అంటున్నారని నిప్పులు చెరిగారు.