ఉదయం లోటస్ పాండ్ వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.. ఆ సమయంలో పోలీసులకు, షర్మిలకు మద్య వాగ్వాదం నడిచింది. ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్ పై షర్మిల చేయి చేసుకున్నారు.. దీంతో ఆమెను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి విషయం తెలిసిందే. లోటస్ పాండ్ వద్ద ఎస్సై, మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నందుకు ఆమెపై ఐపీసీ 353, ఐపీసీ 330 సెక్షన్ల కింద షర్మిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన కుమార్తె షర్మిలను కలిసేందుకు వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. స్టేషన్ లోపలికి వెళ్లనివ్వకుండా పోలీస్ అడ్డుపడ్డారు. దీంతో వైఎస్ విజయమ్మకు పోలీసులకు మద్య కొద్దిసేపు వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలోనే వైఎస్ విజయమ్మ.. ఓ మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపాయి. తాజాగా ఈ ఘటనపై వైఎస్ విజయమ్మ స్పందించారు. వివరాల్లోకి వెళితే..
లోటస్ పాండ్ వద్ద షర్మిల అరెస్ట్, మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడం లాంటి విషయాలపై మీడియా ముందు స్పందించారు వైఎస్ విజయమ్మ.. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదా..? ప్రతిపక్షంలో ఉన్నపుడు ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేస్తారు.. దాన్ని బూచీగా చూపించి ప్రతిసారి హౌస్ అరెస్టు, స్టేషన్ కి తరలించడాలు చేస్తున్నారు. షర్మిల సిట్ అధికారిని కలిసి టీఎస్పీఎస్సీ దర్యాప్తు విషయంపై వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే ఆమెను అడ్డుకున్నారు.. డ్రైవర్ ని కొట్టారు.. ఆమె చుట్టూ మహిళా కానిస్టేబుళ్లతో పాటు పురుష అధికారులు పట్టుకోవడం.. ఎక్కడపడితే అక్కడ చేయి వేస్తూ మీద మీద పడుతుంటే ఎవరికైనా కోపం రాదా? అన్నారు.
షర్మిల అరెస్ట్ విషయంపై మాట్లాడేందుకు స్టేషన్ కి వెళ్లాను. నన్ను స్టేషన్ లోకి వెళ్లనివ్వకుండా పది మంది మహిళా పోలీసులు చుట్టు ముట్టి నన్ను కారులోపలికి తోసేందుకు ప్రయత్నించారు. చాలా దురుసుగా ప్రవర్తించారు.. ఒకేసారి అంతమంది నాపైకి వస్తే ఎవరికైనా ఆవేశం రాదా..? తాను కొట్టాలనుకుంటే ఎంతసేపు పని.. అసలు నేను ఏమీ అనలేదు.. ఇలా పక్కకు జరిపాను అంతే.. మీడియాలో మహిళా పోలీస్ పై చేయి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.. నేను ఎవరినీ కొట్టలేదు. పోలీసులు చేసిన దౌర్జన్యాలు మీడియాలో చూపించలేదు.. మహిళల విషయంలో అలా చేయడం ఎంత వరకు న్యాయం? ఈ విషయం మీడియా, పోలీసుల విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.