తనపై జరుగుతున్న దాడులు, తన అరెస్టు వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. తమ పాదయాత్ర బస్సుకు నిప్పుపెట్టడం, తనని అరెస్టు చేసి శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసి షర్మిల ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమపై దాడులు జరుపుతున్నారంటూ విమర్శించారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే తనని అరెస్టు చేశారన్నారు. కాంట్రాక్టుల పేరుతో తెలంగాణలో రూ.వేల కోట్లు దోచుకుంటున్నారంటూ ఆరోపించారు.
వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. “దాడులు తప్పవని నన్ను బెదిరిస్తున్నారు. నన్ను అరెస్టు చేస్తే పాదయాత్ర నిలిచిపోతుందని భావిస్తున్నారు. ఏమీలేని వారికి అన్ని వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలి. మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చేసిన ఖర్చులపై తప్పకుండా విచారణ జరిపించాలి. అంతేకాకుండా టీఆర్ఎస్ కు చెందిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రిని ఈ విషయంలో ప్రశ్నించాలి. నా పాదయాత్ర రేపటి నుంచే మొదలవుతుంది. అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? మాపై దాడులు చేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. నాకు గానీ, నా కార్యకర్తలకు గానీ ఏమైనా జరిగితే అందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నిలబెట్టుకునే ధైర్యం లేదు మీకు. నేను బూతులు తిట్టానంటూ మాట్లాడుతున్నారు. నన్ను మరదలు అన్న మంత్రిని ఒక్కడినే మేము తిట్టాం. ఇంకోసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతామని చెప్పాం. మాట్లాడితే ఆంధ్రావాళ్లు అంటున్నారు. కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా? ఎక్కడి నుంచో పెళ్లి చేసుకుని ఇక్కడకు తీసుకొచ్చుకున్నారు. ఆమె ఇక్కడి ఆమెనా.. అక్కడి ఆమెనా? ఎక్కడ బతుకుతోంది? మీ వీపు మీకు కనిపించదా? మేము చెప్తున్నామా విడాకులు తీసుకోమని. మీ మాటల ప్రకారం మీ కేటీఆర్ గారు విడాకులు తీసుకోవాలి. కేటీఆర్ భార్యను గౌరవిస్తున్నప్పుడు నన్ను కూడా గౌరవించాలి. నేను ఇక్కడే పెరిగాను.. నేను ఇక్కడే చదువుకున్నాను.. నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను.. ఇక్కడే కొడుకును కన్నాను.. ఇక్కడే బిడ్డను కన్నాను.. నా గతం ఇక్కడే.. నా భవిష్యత్ ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు.. నా బాధ్యత కూడా” అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.