వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ఆ యాత్రకు సంబంధించిన బస్సుకు నిప్పు పెట్టారు. నిప్పు పెట్టటంతో పాటు బస్సుపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిని వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పు బట్టారు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకుని, తనను అరెస్ట్ చేయటానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
పాదయాత్రలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి, యాత్ర ఆపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బస్సుకు నిప్పు పెట్టిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. పెద్ది సుదర్శన్‌పై కూడా విరుచుకుపడ్డారు. ఆయనపై మాటల తూటాలు పేల్చారు. దీంతో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, వైఎస్సార్ టీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇక, షర్మిల.. ఎమ్మెల్యే సుదర్శన్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని టీఆర్‌ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు.