జీవితంలో ఆలోచించి కట్టాల్సినవి రెండే.. రెండు.. ఒకటి ఇల్లు.. రెండు తాళి.. ఇల్లు కట్టాలంటే డబ్బుండాలి. మరి తాళి కట్టాలంటే.. దమ్ముండాలి. డబ్బైతే ఎక్కడైనా అప్పు తెచ్చుకోవచ్చు. కానీ దమ్ము ఎక్కడ తెచ్చుకుంటాం. అందుకే అన్నారు పెద్దలు “కాళ్లు తడవకుండా సముద్రాన్ని ఈదలేం.. కళ్లు తడవకుండా సంసారాన్ని ఈదలేం” అని. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? దానికీ ఓ కారణం ఉందండోయ్! సమాజంలో నేటి యువత పెళ్లంటేనే వద్దు బాబోయ్ అంటున్నారట! ఈ విషయం నేను చెబుతున్నది కాదు.. కేంద్రం చేసిన ఓ సర్వేలో తేలింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విక్రమ్ (పేరు కల్పితం) దసరా పండగకి ఇంటికి వెళ్లాడు. ఊర్లో అడుగుపెట్టగానే రచ్చబండ మీద ఉన్న తాత.. ఏరా ఇదేనా రావడం? ఈ సంవత్సరమైనా మాకు పప్పన్నం తినిపిస్తావా? లేదా? అప్పుడు విక్రమ్ కు దేశంలో ఇన్ని సమస్యలుండగా.. నా పెళ్లే మీకు సమస్యగా కానోస్తుందా తాత.. అని మనసులో తిట్టుకుని ఇంటికి వెళ్లాడు. ఈ పరిస్థితి విక్రమ్ ఒక్కడిదే కాదు. ఈ సమాజంలో చాలా మందిదే. వయసు 30 ఏళ్లు దాటుతున్నా గానీ దేశంలో, రాష్ట్రంలో పెళ్లి కాని యువత పెరిగిపోతున్నారు అని కేంద్రం తాజాగా జరిపిన సర్వేలో తేలింది. ఈ సర్వే నివేదిక ప్రకారం 6 ఏళ్ల క్రితం దేశంలో పెళ్లి చేసుకోని వారు 100 కు 46 మంది ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య 51 కు పెరిగింది. ఇక రాష్ట్రంలో ఈ సంఖ్య 42 నుంచి 47 కు పెరిగినట్లు సర్వేలో తేలింది.
ఇక యువత పెళ్లి వద్దు అనడానికి ప్రధాన కారణాలు ఏంటంటే? కర్ణుడి చావుకు సవాలక్షకారణాలు అన్నట్లు.. మేం పెళ్లి చేసుకోకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. జీవితంలో సెటిల్ అయిన తర్వాతే వివాహం చేసుకుంటాం అనుకుంటున్నారు. ఇదే ఆలోచన మహిళల్లో కూడా ఉంది. దాంతో ఈ రేటు రోజు రోజుకు పెరిగిపోతుంది. అమ్మాయిలకు అబ్బాయిలు దొరకక.. అబ్బాయిలకు అమ్మాయిలకు దొరకక కూడా పెళ్లిళ్లు కావట్లేదు. సంసారం.. పిల్లలు.. ఖర్చులు.. ఇవన్నీ మాకెందుకురా బాబు అని యువత అనుకుంటున్నారు. అమ్మాయిలు కూడా ఎవరో ముక్కూ.. మెుహం తెలియని వారిని పెళ్లి చేసుకుని కష్టపడటం ఇష్టం లేదని మ్యారేజ్ లకు దూరంగా ఉంటున్నట్లు సర్వేలో తేలింది. ఇక రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు కూడా పెళ్లి చేసుకోక పోవడానికి కారణంగా తెలుస్తోంది. బహుశా శాస్త్రాల్లో చెప్పినట్లు “సత్రం భోజనం.. మఠం నిద్ర” ఇదే మంచిదని వారు అనుకుంటూ ఉండవచ్చు. ఇక పిల్లల విషయంలో కూడా నేటి యువతలో పెను మార్పులే వచ్చాయి. అప్పట్లో ఇద్దరు పిల్లలు ఉంటే చాలు అనుకునే వారు. కానీ నేటి సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఖర్చులను చూసి ఇద్దరు వద్దు.. ఒక్కరే ముద్దు అని సర్ధుకు పోతున్నారట నేటి యువత.