ఆ మధ్య డాక్టర్ హర్షవర్ధన్ చనిపోయే ముందు తన భార్యకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలని డబ్బు సమకూర్చి పెట్టారు. విడాకులు ఇచ్చేసి ఆమె జీవితానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. చనిపోతానని తెలిసి కూడా తన బాధ్యతలు నెరవేర్చారు. తాజాగా మరొక యువ వైద్యుడు తాను చనిపోయి కూడా ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు.
అన్నదానం ఒక మనిషిని ఆ పూట కడుపు నింపుతుంది. విద్యాదానం ఒక మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. వస్త్రదానం, ధన దానం, ధాన్యదానం ఇలా ఎన్నో దానాలు ఉన్నాయి. వీటన్నిటినీ మించిన దానం ఒకటుంది. అదే అవయవదానం. ఏ దానం చేసినా గానీ దాన్ని స్వీకరించడానికి మనుషులు అనేవాళ్ళు ఉండాలి కదా. ఒక ప్రాణాన్ని నిలబెట్టేది అవయవదానం. ఒక జీవితానికి వెలుగునిచ్చేది అవయవదానం. ఏదో ఒక లోపంతో జీవించేవారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అలాంటి వారికి ఒక మనిషి చనిపోయే ముందు అవయవదానం చేస్తే.. ఒక మనిషికి ప్రాణం పోసినట్టు, అతని జీవితంలో వెలుగు నింపినట్టు అవుతుంది. చాలా మంది తాము చనిపోయాక తమ అవయవాలను వేరొకరికి ఉపయోగపడేలా ఆర్గాన్ డోనర్లుగా మారుతున్నారు.
అలాంటి వారిలో 24 ఏళ్ల నిఖిల్ ఒకడు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన చిన్ని నిఖిల్.. బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్) పూర్తి చేసి అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఈ యువ వైద్యుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఏప్రిల్ 29న బెంగళూరు నుంచి ఏపీలోని కావలికి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిఖిల్ తలకు బలమైన గాయం కావడంతో బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు మే 1న బ్రెయిన్ డెడ్ అని వైద్యులు వెల్లడించారు. దీంతో కుమారుడి కోరిక మేరకు అవయవదానం చేసేందుకు అంగీకరించారు. అందుకోసం ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి నిఖిల్ ను సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అలా నిఖిల్ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. చదువుకుంటున్న సమయంలోనే తాను చనిపోతే తన అవయవాలను వేరొకరికి దానం చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. అంతేకాదు అవయవదానం ప్రాముఖ్యత గురించి చెబుతూ ఒక కవిత కూడా రాశాడు.
‘నా తనువు మట్టిలో కలిసినా.. అవయవదానంతో మరొకరిలో జీవిస్తా
ఒక అమ్మకు బిడ్డగా మరణించినా మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా
ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్ళు..
ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె
కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు
ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు
కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి కాలేయం
నాలోని ప్రతి అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి.
ఇదే మీరు నాకు ఇచ్చే గొప్ప బహుమానం.
ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను, చిరంజీవినై ఉంటాను.
అవయవదానం చేద్దాం.
మరో శ్వాసలో శ్వాసగా ఉందాం’
ప్రస్తుతం ఈ కవిత కంటతడి పెట్టిస్తోంది. విద్యార్ధి దశలో ఉన్నప్పుడు రాసుకున్న కవిత ఇది. అప్పట్లో చనిపోతే తన అవయవాలు మరొకరికి దానం చేయాలని నిశ్చయించుకున్నాడు. తల్లిదండ్రులు కూడా అతని కోరిక నెరవేర్చారు. అలా నిఖిల్ ఆరుగురిలో జీవిస్తున్నాడు. ఒక్కడే ఆరుగురిగా జీవిస్తూ.. వారి తల్లుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు. తన తనువు మట్టిలో కలిసినా టీనా శరీరంలోని అణువణువూ మరొకరికి ఉపయోగపడితే చాలనుకున్నాడు. మరి తాను చనిపోయి ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపిన నిఖిల్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే నిఖిల్ ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుందాం. ఓం శాంతి.