అనారోగ్య సమస్యలు ఉండటం లేదూ కానీ హార్ట్ ఎటాక్ బలి తీసుకుంటుంది. ఎవ్వరూ ఊహించని విధంగా అనేక మంది దీని బారిన పడుతున్నారు. గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మహిళ హార్ట్ ఎటాక్ కారణంగా మరణించింది.
గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య దేశంలో నానాటికి పెరుగుతోంది. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్‍కు గురై చనిపోతున్నారు. పెళ్లి సంబరాలు, వేడుకల్లో కుటుంబ సభ్యులు లేదా బంధువుల్లో ఒకరిని బలి తీసుకుని విషాదాన్ని నింపుతుంది. అనారోగ్య సమస్యలు లేని వారిని సైతం ఈ హార్ట్ ఎటాక్ భయపెడుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా అనేక మంది దీని బారిన పడుతున్నారు. అయితే ఇటీవల తెలంగాణలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య భయాందోళనకు గురి చేస్తోంది. చిన్న, పెద్దలు అనే తేడా లేకుండా చిట్టి గుండె ఆగిపోతుంది. తాజాగా ఓ మహిళ గుండె పోటుతో మరణించింది. వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అనేక మంది మహిళలు, లబ్దిదారులు హాజరయ్యారు. అజ్జకోలు గ్రామానికి చెందిన నడిమిటి నర్సమ్మ కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇటీవల తన మనవరాలికి వివాహం చేయగా.. ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థికసాయం మంజూరైంది. అయితే చెక్కు తీసుకునేందుకు నర్సమ్మ తన మనవరాలితో కలిసి ఉదయం 10 గటంలకే మదనాపురం వచ్చింది. మధ్యాహ్నం ఒకటిన్నరకు మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డిలు చెక్కులు పంపిణీ చేశారు. అయితే చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆలస్యమైందని భావించిన నర్సమ్మ తన మనవరాలితో కలిసి బయటకు వెళ్లింది.
లబ్ధిదారురాలి పేరును అధికారులు పిలవగా.. వారు రాలేదు.. చెక్కును తీసుకోలేదు. కాసేపటికి వేదిక వద్దకు చేరుకున్న నర్సమ్మ పేరు పిలిచినప్పుడు తాను లేనని, తన మనవరాలి చెక్కును ఇవ్వాల్సిందిగా స్థానిక బీఆర్ఎస్ లీడర్లను కోరింది. అయితే కాసేపు ఆగాలని.. లేదంటే రేపు ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి తీసుకోవాలని నేతలు నర్సమ్మకు సూచించారు. అయితే మళ్లీ ఊరు వెళ్లి ఇక్కడకు రావాలంటే ఖర్చు, శ్రమతో కూడుకున్న పనని భావించిన నర్సమ్మ కొద్ది సేపు వేచి చూద్దామని భావించి బయట ఉన్న ఆటోలో మనవరాలితో కలిసి కూర్చుంది. తనకు నీరసంగా ఉందని చెప్పడంతో మనవరాలు టిఫిన్ తీసుకొచ్చి తినిపించింది.
సుమారు నాలుగు గంటల సమయంలో ఆటోలోనే కూర్చున్న నర్సమ్మ తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడున్న వారి సాయంతో మనవరాలు వృద్ధురాలని కొత్తకోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో మృతురాలి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ ప్రాణాలు తీస్తుండటం వెనుక అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.