24 గంటల్లో ఒకే ఇంట్లో తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లి తట్టుకోలేకపోయింది. కన్న కొడుకు లేడు, ఇక తిరిగి రాడన్న వార్త ఆమె గుండెను ఆగేలా చేసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. కుమారుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని నేదునూరు గ్రామం. ఇక్కడే కనకయ్య-కనకలక్ష్మి అనే దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ముగ్గురు కూతుళ్లతో పాటు శ్యామ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతనికి గతేడాది హుస్నాబాద్ కు చెందిన శారద అనే అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు బాగానే సంసారం చేశారు. అయితే పెళ్లైన మూడు నెలల తర్వాత శారద మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో తరుచు బాధపడేది. ఈ క్రమంలోనే శారద తన పుట్టింటికి వెళ్లి ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భార్య చనిపోవడంతో భర్త వెక్కి వెక్కి ఏడుస్తూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అలా కొన్ని నెలలు గడిచింది. భార్య లేని జీవితం ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, శ్యామ్ ఇటీవల తన అత్తగారింటికి వెళ్లాడు. అదే రోజు భార్య ఉరి వేసుకున్న చెట్టుకు కింద పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లి కనకలక్ష్మి గుండెలు పగిలేలా ఏడ్చింది. కొడుకు లేడు, ఇక రాడనే విషయాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కనకలక్ష్మి ఏడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించిందని నిర్ధారించారు. 24 గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మరణించడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన తల్లి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.