ఈ ప్రపంచంలోని ఏ తల్లికీ రాకూడని శోకం ఆ తల్లికి వచ్చింది. ప్రాణంగా పెంచుకున్న కుమారుడికి తల కొరివిపెట్టాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఏ తల్లికైనా తన బిడ్డలే ప్రపంచం.. పంచ ప్రాణాలు కూడా. బిడ్డలకు ఏ చిన్న కష్టం కలిగినా తల్లి విలవిల్లాడిపోతుంది. అలాంటిది కన్న బిడ్డ ప్రాణాలు కోల్పోతే ఆ తల్లి బాధను వర్ణించగలమా?.. తల కొరివి పెట్టాల్సిన వాడికే తల కొరివి పెట్టాల్సి వస్తే ఆ తల్లి జీవితంలో దాన్ని మించిన విషాదం ఇంకోటి ఉంటుందా?.. తాజాగా, ఏ తల్లికి రాకూడని శోకం ఓ మహిళకు వచ్చింది. కుమారుడు చనిపోతే ఆమే స్వయంగా తల కొరివి పెట్టాల్సి వచ్చింది. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌కు చెందిన నామాల వెంకట స్వామి అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.
ఇతడు కామారెడ్డిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. నామాల స్వామికి పెళ్లై ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా.. తల్లి అతడి వద్దే ఉంటోంది. వెంకట స్వామికి అతడి భార్యకు అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వస్తున్నాయి. శనివారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్యతో గొడవ కారణంగా వెంకటస్వామి మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అతడ్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం అతడు మరణించాడు.
మంగళవారం స్వగ్రామం అయిన రామారెడ్డిలో అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అతడి భార్య రాలేదు. దీంతో వెంకటస్వామి తల్లి అంత్యక్రియలు నిర్వహించింది. కుమారుడికి తలకొరివి పెట్టింది. కుమారుడికి తల కొరివి పెడుతున్న సందర్భంలో ఆమె విలవిల్లాడిపోయింది. గుండెలవిసేలా ఏడ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.