నేటికాలంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఏ చిన్న జాబ్ దొరికిన చాలు అనే ధోరణిలో నేటి యువత ఉంది. కొందరు అయితే జాబ్ కోసం భారీ మొత్తంలో డబ్బులు కూడా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాంటి యువత బలహీనత సొమ్ముగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ ఎస్సై ని అంటూ అందరిని నమ్మించి. నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచేసింది. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఒకటి ఉంది. ప్రేమించిన వ్యక్తి రూ.13 లక్షలు ఇచ్చి మోసపోయిన ఈ మహిళ.. ఆ అప్పులు తీర్చేందుకు ఎస్సై అవతారం ఎత్తిందంటా. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంకి చెందిన విజయభారతి అనే మహిళ డిగ్రీ పూర్తి చేసి ఎస్సై జాబ్ కోసం ప్రయత్నాలు చేసేది. ఈ క్రమంలో 2018లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నప్పటికీ ఎంపిక కాలేదు. అదే సమయంలో మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతడు అవసరం ఉన్నదంటూ విజయభారతిని రూ.13 లక్షలు అడిగాడు. ప్రియుడు అడిగాడని అప్పులు తెచ్చి మరీ అతడికి ఆ డబ్బు ఇచ్చింది. అనంతరం అతడు విజయభారతిని మోసం చేశాడు.
మోసపోయిన ఆమె అప్పులు తీర్చేందుకు ఎస్సై అవతారం ఎత్తింది. ఎస్సై పరీక్షలకు సంబంధించి నకిలీ పత్రాలు, ధ్రువపత్రాలు తయారుచేసింది. అంతేకాదు, ఎస్సైగా ఎంపికైనట్టు నమ్మించి పలువురి నుంచి సన్మానాలు కూడా చేయించుకుంది. ఆ ఫొటోలను చూపించి పోలీసు శాఖలో, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేయడం ప్రారంభించింది. ఎస్సైగా నమ్మించి వరంగల్‌కు చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. వీరికిప్పుడు నాలుగు నెలల చిన్నారి ఉంది.
ఆ క్రమంలోనే పదుల సంఖ్యలో యువతను మోసం చేసింది. అలానే నారాయణరావుపేట చెందిన ఓ యువకుడి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె పత్తా లేకపోవడంతో పోలీసులకు యువకుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఆమె కోసం గాలించిన పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంది. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని అతడి ద్వారా ఫోన్ చేయించారు. చివరికి హుస్నాబాద్‌లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికెళ్లి ఆమెను అరెస్టు చేశారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.