అన్ని బంధాల్లోనూ పెళ్లి బంధం చాలా ప్రత్యేకం అని పెద్దలు అంటుంటారు. ఒక్కసారి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాక చనిపోయేంత వరకు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరుగా బతుకుతారు.
కొన్ని జంటలు చాలా ప్రత్యేకం. పెళ్లి అయ్యేంత వరకు ఎవరి ప్రపంచాలు వారివి. కానీ వివాహం అయ్యాక ఇద్దరిదీ ఒకే ప్రపంచం. ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేని పరిస్థితి. ముఖం చూసి ఒకరి ఆలోచనలను ఇంకొకరు అర్థం చేసుకోవడం.. పిల్లలు, కుటుంబాన్ని బరువుగా కాకుండా బాధ్యతగా భావించి బతుకుతుంటారు. జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని కలిసే ఎదుర్కోవడం, సుఖాన్ని కలిసే ఆస్వాదిస్తుంటారు. ఇలా ఉండేవారిని ఆదర్శ దంపతులని అంటుంటారు. అలాంటి ఆదర్శ దంపతులు ఎడబాటును తట్టుకోలేక 24 గంటల వ్యవధిలో కన్నుమూసిన ఘటన పాల్వంచలో వెలుగు చూసింది. భద్రాద్రి జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగుకు చెందిన శ్యాంపురి భాస్కర్‌రావు (70), బాయమ్మ (60)లు నలభై ఏళ్ల కింద ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నారు.
కులాలు వేరైనా భాస్కర్ రావు, బాయమ్మలు తమ పెద్దలను ఎదిరించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆ బంధాన్ని నాలుగు దశాబ్దాల పాటు సాగించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అనుబంధం వారిది. ఎక్కడికైనా వెళ్లాలన్నా కలిసే వెళ్లేవారు. ఈ అన్యోన్యమైన జంటకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వారి పెళ్లిళ్లు జరిగాయి. వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ అన్యోన్యతను చూడలేని విధికి కన్నుకుట్టినట్లుంది. గుండెపోటుతో భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు హార్ట్ ఎటాక్‌తో భాస్కర్‌రావు చనిపోయారు. భర్త ఎడబాటును తట్టుకోలేక బాయమ్మ రోజంతా ఏడ్చారు. ఆమె తీవ్రంగా కుంగిపోయారు. మానసిక బాధతో శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు బాయమ్మ మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో పేరెంట్స్ ఇద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.