టెక్నాలజీతో,సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచమంతా దూసుకుపోతుంటే కొన్నిచోట్ల మూఢనమ్మకాలు ప్రజలను అంధకారంలోకి నెడుతున్నాయి. చనిపోయిన మనిషిని తిరిగి బతికిస్తానంటూ ఓ వ్యక్తి పూజలు చేయడం, జగిత్యాల రూరల్ స్టేషన్ పరిధిలోని టీఆర్‌నగర్‌లో కలకలం రేపింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని బతికిస్తానంటూ పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
జగిత్యాల పట్టణం టీఆర్ నగర్ కు చెందిన ఒర్సు రమేశ్అనారోగ్యంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతిచెందాడు. దీంతో బంధువులు శవాన్ని టీఆర్ నగర్ లోని ఇంటికి తీసుకువచ్చారు. మృతుడి ఇంటి సమీపంలోని కొమ్మరాజుల పుల్లేశ్, భార్య సుభద్ర దంపతులు మంత్రాలు చేయడంతోనే రమేశ్ చనిపోయాడంటూ బంధువులు వారిపై దాడి చేసి తాళ్లతో కట్టేశారు. మంత్రాలు వేసి రమేశ్‌ను మళ్లీ బతికిస్తానని పుల్లేశ్ చెప్పడంతో బంధువులు కట్లు విప్పారు. అనంతరం పుల్లేశ్శవం వద్ద పూజలు మొదలు పెట్టాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పుల్లేశ్ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంత్రాలు వేస్తే బతుకుతాడని, తమకు మృతదేహాన్ని అప్పగించాలని జగిత్యాల – కరీంనగర్ రహదారిపై మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. డాక్టర్లు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
మృతదేహాన్ని దహనం చేసేది లేదని, కొమ్మరాజుల పుల్లేశ్ను అప్పగిస్తే మళ్లీ బతికించుకుంటామని బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మానసిక స్థితి సరిగా లేకపోతే సైక్రియాటిస్ట్‌లను సంప్రదించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.