ప్రజలకు ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది. వర్షపు చిరుజల్లులు కురవడంతో సాయంత్రం చల్లటి వాతావరణం ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎండ నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వర్షపు చిరు జల్లులు పలకరించాయి. తిరుమలను వడగండ్ల వాన ముంచెత్తెగా, తెలంగాణలో హైదరాబాద్ సహా సంగారెడ్డి, రంగారెడ్డితో పాటు పలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలయింది. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలకు ఎండ నుంచి ఊరట లభించినట్లయ్యింది.
తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం చల్లటి వాతావరణం ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించింది. మధ్యాహ్నం సమయంలో తిరుమలను భారీ వర్షం ముంచెత్తింది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో.. భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక సాయంత్రం సమయంలో తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. హైదరాబాద్ సహా సంగారెడ్డి, రంగారెడ్డి, చేవెళ్ల, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ప్రాంతాలలో వర్షం పడుతుంది. ఇదిలావుంటే జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు నగరవాసులకు కీలక సూచనలు చేశారు. మరికొద్ది సేపట్లో భారీవర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అత్యవసరమైతే తప్ప ఇంటిలో నుండి బయటకు రావద్దని సూచించారు. అంతేకాక ఎక్కడైనా చెట్లు, కరెంట్ పోల్స్ విరిగిపడడం లాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడితే 040-29555500కి కాల్ చేసి తెలియజేయాలని సూచించారు.
కాగా, ఉరుములు మెరుపులు, వడగళ్ల వానలు, ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసిన సంగతి తెలిసిందే. మార్చి 21 వరకు నగరంలో చల్లటి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) కూడా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.