స్నేహం ప్రపంచంలోనే ఇదొక అద్భుతమైన బంధం. నిజమైన స్నేహితుడు మనతో ఎటువంటి బంధుత్వం లేకపోయినా స్నేహం అనే బంధం కోసం ఏమైనా చేయడానికి సిద్దమైపోతాడు. కొన్నిసార్లు మన సొంత వాళ్లకు మించి మనకోసం త్యాగాలు చేస్తుంటారు. ఎంత విపత్కర సమయంలోనైనా మనకు అండగా నిలబడి మనకోసం తను రిస్క్ చేస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే స్నేహం యొక్క గొప్పతనం అనంతం.
అయితే స్నేహం అన్నది ఏ ఒక్క వర్గానికో, మతానికో సంబంధించింది కాదు మహా ఐశ్వర్యవంతునికైనా, కటిక పేదవాడికైనా స్నేహం ఒకటే. సామాన్యుడి నుండి పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు అందరికీ స్నేహితులు ఉండనే ఉంటారు. స్నేహానికి హెచ్చు తగ్గులు ఉండవు. స్నేహానికి వయసు పరిమితి అవసరం లేదు. కాగా సినీ ఇండస్ట్రీలోని ఎంతో మంది గొప్ప స్నేహితులు ఉన్నారు. అలాంటి వారిలో ఎక్కువగా వినిపించే పేర్లు జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజీవ్ కనకాల.
స్టూడెంట్ నంబర్ వన్ చిత్రంతో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిజానికి చెప్పాలంటే వీరి మధ్య బాండింగ్ మరింత బలపడింది అనే చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరి గురించి మరొకరు ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. తమ స్నేహ బంధంలోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటారు. గతంలో అశోక్ చిత్రం తర్వాత వీరి మధ్య స్నేహబంధం దూరమయ్యింది అని కొన్ని కారణాల వలన వీరి మధ్య విభేదాలు వచ్చాయని అంతా భావించారు .
ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల కనిపించడం లేదు అంటూ ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే వాటినన్నింటినీ కొట్టి పారేస్తూ మా మధ్య స్నేహం ఎప్పటికీ చెరగదని పలు సందర్భాల్లో చెప్పడమే కాక “జనతా గ్యారేజ్” చిత్రంలో కలిసి కనిపించి ఆ రూమర్స్ కు తెరదించారు. అయితే ఎన్టీఆర్ నా స్నేహితుడు అయినంత మాత్రాన తను చేసే ప్రతి సినిమాలో నటించడం కుదరదని అది డైరెక్టర్ పై ఆధారపడి ఉంటుంది.
ఆ కథలో తనకు సూట్ అయ్యే పాత్ర లేకపోతే నటించడం ఎలా సాధ్యమవుతుందని రాజీవ్ కనకాల తెలిపారు. అంతే కాకుండా ప్రతి సినిమాలో తారక్ తో కలిసి కనిపిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని పలు సందర్భాల్లో తన మనసులోని మాటలను వ్యక్త పరిచారు రాజీవ్ కనకాల. తారక్ ఎప్పటికీ నాకు మంచి స్నేహితుడు గానే ఉంటాడని…మాది ఆ దేవుడే వేసిన స్నేహబంధం అని చెప్పారు.
వీరి మధ్యన ఎన్ని వివాదాలు అవతలివారు సృష్టించినా వీరి స్వచ్ఛమైన స్నేహాన్ని దూరం చేయలేకపోయారు. ఏ పరిస్థితులు వీరి స్నేహాన్ని కాదనలేకపోయాయి. ఈ రోజు స్నేహితుల రోజు కు గుర్తుగా వీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే మంచి స్నేహితులుగా కొనసాగాలని కోరుకుందాం.