తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన సైఫ్ కు బెయిల్ మంజూరు అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ కు బెయిల్ మంజూరైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం, వరంగల్ జిల్లా రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వై. సత్యేంద్ర ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 10 వేల సొంత పూచీకత్తుతో పాటు ఇద్దరు పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని సూచించారు. మృతురాలు ప్రీతి కుటుంబ సభ్యులను బెదిరించకూడదని కోర్టు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే బెయిల్ ను రద్దు చేయమని పోలీసులు కోరవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న ప్రీతి.. ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హానికరమైన మెడిసన్ తీసుకోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 26న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రీతి మరణించింది. కాగా ప్రీతిది ఆత్మహత్య అని, ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే కారణమని సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. ప్రీతిని సైఫ్ చంపలేదని.. సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి చనిపోయిందని.. ఇది ఆత్మహత్యే అని పోలీసులు తెలిపారు. అయితే ప్రీతి తండ్రి మాత్రం తమ కూతురిది ఆత్మహత్య కాదు, హత్యే అని ఆరోపించారు. కావాలని డయాలసిస్ చేసి టాక్సికాలజీ రిపోర్టును తప్పుదారి పట్టించారని ప్రీతి తండ్రి ఆరోపించారు.
ప్రీతికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టులు తమకు ఇవ్వలేదని ప్రీతి సోదరుడు పృథ్వీ వెల్లడించాడు. ప్రీతి ఎలా చనిపోయిందన్న విషయంపై ఇప్పటికీ తమకు స్పష్టత లేదని ప్రీతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సైఫ్ ను అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో పోలీసులు సైఫ్ ను ఫిబ్రవరి 24న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సైఫ్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. విచారణ జరపడంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అయితే ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ పట్టుమని రెండు నెలలు కూడా జైల్లో ఉండలేదు. అతనికి సంబంధించిన వ్యక్తులు బెయిల్ కి అప్లై చేయడంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరి సైఫ్ కు బెయిల్ మంజూరు అవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.