ఏప్రిల్ మొదటి వారం నుంచి తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరోవైపు అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉదయం పూట భానుడి ప్రతాపానికి తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే.. ఇక మే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. ఎండాకాలంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో బాలికల వసతీ గృహంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లా హనుమకొండ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో గత రాత్రి 11 గంట ప్రాంతంలతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాలికల వసతి గృహంలోని బి 10 గదిలో హఠాత్తుగా మంటలు రావడంతో కాలేజ్ సిబ్బంది వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే హాస్టల్ గదిలో మంచాలు, దుప్పట్లు, పరుపులు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇతర వస్తువులు మంటల్లో కాలి పూర్తిగా దగ్ధమైపోయాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే నిట్ కి చేరుకొని మంటలు ఆర్పివేశారు. హాస్టల్ గదిలో మంటలు రావడంతో వెంటనే విద్యార్థినులు బయటకు పరుగులు తీసి ప్రాణాలు రక్షించుకున్నారు.
అగ్ని ప్రమాదం వల్ల సుమారు ఐదు లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశామని అగ్నిమాపక అధికారి అంగోతు నాగరాజు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. మంటలు రావడంతో విద్యార్థినులంతా అప్రమత్తమై బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నారని ఆయన అన్నారు. అగ్ని ప్రమాదం సమయంలో జోరుగా వర్షం పడుతుందని.. ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థులు, అద్యాపకులు తీవ్ర ఆందోళనకు గురై హాస్టల్ వద్దకు చేరుకున్నారు. అయితే విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో ఇలాంటి ప్రమాదం జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.